అనిల్ ‘కంచు’ పట్టు
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ 85 కేజీల విభాగంలో అనిల్ కుమార్... మహిళల ఫ్రీస్టయిల్ 75 కేజీల విభాగంలో జ్యోతి కాంస్య పతకాలు గెల్చుకున్నారు. కాంస్య పతక బౌట్‌లో అనిల్ 7–6తో మొహమ్మద్ అలీ షమ్సీద్దినోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు.
ఒకదశలో 1–6 పాయింట్లతో వెనుకబడిన అనిల్ అద్భుత ప్రదర్శనతో ఆరు పాయింట్లు సంపాదించడం విశేషం. మరోవైపు జ్యోతి సెమీఫైనల్లో 0–10తో మసాకా ఫురుచి (జపాన్) చేతిలో ఓడిపోయి కాంస్యాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన దీపక్ (గ్రీకో రోమన్–71 కేజీలు)... రీతూ (మహిళల ఫ్రీస్టయిల్–63 కేజీలు) కాంస్య పతకాల పోరులో తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయి నిరాశపరిచారు.