ఐపీఎల్ వల్లే ఇదంతా...
* కొత్త కుర్రాళ్ల ప్రదర్శనపై ధోని వ్యాఖ్య
* పుణే టీమ్ జెర్సీ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొన్ని సందర్భాల్లో చెడ్డపేరు మూట గట్టుకున్న మాట వాస్తవమేనని, అయితే కుర్రాళ్లకు తగిన అవకాశాలు రావడం ఈ లీగ్ వల్లే సాధ్యమైందని భారత కెప్టెన్ ఎమ్మెస్ ధోని అభిప్రాయపడ్డాడు. ‘మనం మంచిని కూడా చూడాలి. దేశవాళీలో ప్రతిభను ఐపీఎల్ వల్లే గుర్తించగలిగాం. కొత్త ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుంటూ రాణించడం భారత క్రికెట్‌కు మంచి పరిణామం’ అని అతను వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టీమ్ రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ జెర్సీని సోమవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ధోనితో పాటు జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కూడా పాల్గొన్నారు. ఇన్నేళ్లుగా కుదురుకున్న జట్లతో పోలిస్తే కొత్త టీమ్‌లకు ఐపీఎల్‌లో కొంత ఇబ్బంది ఎదురవుతుందన్న ధోని, మాజీ సహచరుడు రైనాతో పోటీకి సిద్ధమన్నాడు. మరో వైపు లోధా కమిషన్ నివేదికపై మాట్లాడేందుకు ధోని నిరాకరించాడు. కమిషన్ తనకు నివేదిక ఇవ్వలేదని, ఏం చేయబోతున్నారో బీసీసీఐనే అడగాలని స్పష్టం చేశాడు.
నా మనసు చెన్నైతోనే
కొత్త జట్టుతో అంతా బాగుందని, చెన్నై అంతా గతమని తాను వ్యాఖ్యానిస్తే అది ఆత్మవంచన అవుతుందని ధోని అన్నాడు. ఆటతోనే కాకుండా మానసికంగా కూడా అక్కడివారితో బంధం ఏర్పడిపోయిందని అతను చెప్పాడు.