గట్టెక్కిన జొకోవిచ్
ఐదు సెట్‌ల పోరులో విజయం
► ఎదురులేని నాదల్
► ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: కొత్త కోచ్ అగస్సీ పర్యవేక్షణలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆడుతోన్న డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు శుక్రవారం కఠిన పరీక్ష ఎదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 5–7, 6–3, 3–6, 6–1, 6–1తో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏకంగా 55 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం.
మరోవైపు నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా), ఆరో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో నాదల్ 6–0, 6–1, 6–0తో బాసిలాష్‌విలి (జార్జియా)ను చిత్తుగా ఓడించగా... థీమ్ 6–1, 7–6 (7/4), 6–3తో జాన్సన్ (అమెరికా)పై గెలుపొందాడు.
రావ్‌నిచ్ 6–1, 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి లోపెజ్ (స్పెయిన్) గాయంతో వైదొలిగాడు. అయితే 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) మూడో రౌండ్‌లో ఇంటిదారి పట్టారు. దిమిత్రోవ్ 5–7, 3–6, 4–6తో కరెనో బుస్టా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. జెబలాస్ (అర్జెంటీనా)తో జరిగిన మ్యాచ్‌లో గాఫిన్ 5–4తో ఆధిక్యంలో ఉన్నపుడు కోర్టులో జారిపడ్డాడు. కాలికి గాయం కావడంతో గాఫిన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
ముగురుజా ముందుకు...
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్) మూడో రౌండ్‌లో 7–5, 6–2తో పుతింత్‌సెవా (కజకిస్తాన్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 7–5, 4–6, 8–6తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై, 23వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6–2, 6–2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)పై గెలిచారు.
బోపన్న జంట గెలుపు
పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)–క్యువాస్ (ఉరుగ్వే) 5–7, 7–6 (7/4), 6–4తో ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)లపై... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) 6–4, 3–6, 6–4తో మరాచ్ (ఆస్ట్రియా)–పావిక్ (క్రొయేషియా)లపై గెలుపొందగా... లియాండర్ పేస్ (భారత్)–స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) 6–7 (3/7), 2–6తో మరెరో–రొబ్రెడో (స్పెయిన్)ల చేతిలో ఓడిపోయారు.
పేస్–హింగిస్ జోడీకి షాక్
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 4–6, 6–1, 2–10తో సూపర్ టైబ్రేక్‌లో క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–స్రెబొత్నిక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 7–5, 6–3తో దరియా జురాక్–పావిక్ (క్రొయేషియా) జోడీపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.