మన్‌ప్రీత్ కౌర్‌పై తాత్కాలిక నిషేధం
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ షాట్‌పుట్ క్రీడాకారిణి మన్‌ప్రీత్ కౌర్ మరోసారి డోపింగ్‌లో పట్టుబడింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏప్రిల్ 24న చైనాలో జరిగిన తొలి అంచె ఆసియా గ్రాండ్‌ప్రిలో డోపింగ్ పరీక్షల నిమిత్తం ఆమె నుంచి యూరిన్ శాంపిల్ తీసుకున్నారు. దీంట్లోనూ ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో వేటు పడింది. ఈ దెబ్బతో ఆమె వచ్చే నెల 4 నుంచి 13 వరకు లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం కానుంది.
అలాగే ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో సాధించిన స్వర్ణం కూడా కోల్పోయినట్టే. గత నెలలో జరిగిన ఫెడరేషన్ కప్ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన శాంపిల్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరక ఆనవాళ్లు ఉన్నట్టు తేలిన విషయం తెలిసిందే. ఇక ఆమె ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలితే నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొంటుంది.