Manpreet Kaur
-
మన్‌ప్రీత్ కౌర్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ : ఆసియా చాంపియన్‌గా నిలిచిన షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ నిర్ధారించారు. 2017లో మన్‌ప్రీత్ నాలుగు సార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమైంది. ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన జూలై 20, 2017నుంచి తాజా శిక్ష అమల్లోకి వస్తుంది. అయితే తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్‌కు ఆమె అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. కాగా శాంపుల్ సేకరించిన నాటి నుంచి ఆమె అన్ని ఫలితాలు చెల్లవంటూ ‘నాడా’ ప్యానెల్ తీర్పునివ్వడంతో 2017లో గెలుచుకున్న ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా మన్‌ప్రీత్ కోల్పోనుంది. షాట్‌పుట్‌లో 18.86 మీటర్ల రికార్డు మన్‌ప్రీత్ పేరిటే ఉంది. 2017లో ఆసియా గ్రాండ్‌ప్రి, ఫెడరేషన్ కప్, ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఏకంగా నాలుగు సార్లు ‘పాజిటివ్’గా తేలింది. వీటిలో ఒక సారి మెటనొలోన్, మరో మూడు సార్లు డైమిథైల్‌బుటిలమైన్ వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు బయటపడింది. -
మన్‌ప్రీత్ కౌర్‌పై తాత్కాలిక నిషేధం
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం న్యూఢిల్లీ: భారత స్టార్ షాట్‌పుట్ క్రీడాకారిణి మన్‌ప్రీత్ కౌర్ మరోసారి డోపింగ్‌లో పట్టుబడింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఆమెపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏప్రిల్ 24న చైనాలో జరిగిన తొలి అంచె ఆసియా గ్రాండ్‌ప్రిలో డోపింగ్ పరీక్షల నిమిత్తం ఆమె నుంచి యూరిన్ శాంపిల్ తీసుకున్నారు. దీంట్లోనూ ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో వేటు పడింది. ఈ దెబ్బతో ఆమె వచ్చే నెల 4 నుంచి 13 వరకు లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం కానుంది. అలాగే ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో సాధించిన స్వర్ణం కూడా కోల్పోయినట్టే. గత నెలలో జరిగిన ఫెడరేషన్ కప్ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన శాంపిల్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరక ఆనవాళ్లు ఉన్నట్టు తేలిన విషయం తెలిసిందే. ఇక ఆమె ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలితే నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొంటుంది. -
డోపింగ్‌లో దొరికిన మన్‌ప్రీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మేటి అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ డోపింగ్‌లో పట్టుబడింది. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ఆసి యా చాంపియన్‌షిప్‌లో ఆమె షాట్‌పుట్‌లో స్వర్ణం గెలిచింది. లండన్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సంపాదించింది. ఇప్పుడు స్వర్ణం, బెర్త్ రెండూ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. గత నెలలో జరిగిన ఫెడరేషన్ కప్ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా... ‘ఎ’ శాంపిల్‌లో నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. తదుపరి ‘బి’ శాంపిల్ కూడా ఇలాగే పాటిజివ్ రిపోర్టు వస్తే ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధికారి అన్నారు. -
మన్‌ప్రీత్‌కు స్వర్ణం
జిన్హువా (చైనా): ఆసియా గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మీట్లో భారత క్రీడాకారులు మెరిశారు. మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఇనుప గుండును 18.86 మీటర్ల దూరం విసిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), టింటూ లుకా (మహిళల 800 మీటర్లు), నీనా (లాంగ్‌జంప్), జిన్సన్ జాన్సన్ (పురుషుల 800 మీటర్లు) రజత పతకాలు సాధించగా... ద్యుతీ చంద్ (మహిళల 100 మీటర్లు), ఓం ప్రకాశ్ (పురుషుల షాట్‌పుట్) కాంస్య పతకాలు గెలిచారు.