అట్లెటికో డి కోల్‌కతా
ఐఎస్‌ఎల్‌లో గంగూలీ జట్టు పేరు ప్రకటన
ఆవిష్కరించిన ‘మాడ్రిడ్’ యజమాని
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీ పేరు ఖరారైంది. ‘అట్లెటికో డి కోల్‌కతా’గా నామకరణం చేసిన ఈ ఫ్రాంచైజీ పేరును బుధవారం జట్టు సహ యజమాని, అట్లెటికో డి మాడ్రిడ్ యజమాని అయిన మిగెల్ ఏంజెల్ గిల్ మారిన్ ఆవిష్కరించారు. ఫ్రాంచైజీ సహ యజమానులైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, సంజీవ్ గోయెంకా, హర్షవర్ధన్ నియోటియా, ఉత్సవ్ పరేఖ్‌లు హాజరయ్యారు. భారత్‌లో ఎనిమిది నగరాల ఫ్రాంచైజీలతో ఏర్పాటైన ఐఎస్‌ఎల్‌లో మొట్ట మొదటిగా కోల్‌కతా తమ పేరును ప్రకటించినట్లయింది.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఐఎస్‌ఎల్ ద్వారా దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, లీగ్‌తోపాటు అకాడమీలనూ ఏర్పాటు చేసి నైపుణ్యాన్ని వెలికి తీస్తామని తెలిపాడు. లీగ్ ప్రారంభానికి ముందు కోల్‌కతాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సిందిగా అట్లెటికో డి మాడ్రిడ్ జట్టును కోరతామన్నాడు. భారత్‌లో క్రికెట్‌కున్న ఆదరణ కొనసాగుతూనే ఫుట్‌బాల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.