Atletico de Kolkata
-
గోవా చేతిలో కోల్‌కతాకు చుక్కెదురు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రస్తుత సీజన్లో నిలకడగా ఆడుతోన్న మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాకు చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 1–2తో ఎఫ్‌సీ గోవా చేతిలో కంగుతింది. మ్యాచ్ మొదటి అర్ధ భాగాన్ని ఇరు జట్లు గోల్స్ లేకుండానే ముగించాయి. గోవా తరఫున 60వ నిమిషంలో మౌర్తాడ ఫాల్... 66వ నిమిషంలో ఫెరాన్ కొరొమినాస్ ఒక్కో గోల్ చేశారు. 64వ నిమిషంలో కోల్‌కతాకు జాబీ జస్టిన్ ఏకైక గోల్ అందించాడు. నేడు ముంబైతో బెంగళూరు ఆడుతుంది. -
కోల్‌కతా 5 హైదరాబాద్ 0
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తొలిసారి అడుగు పెట్టిన హైదరాబాద్ పుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయం ఎదురైంది. మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా (ఏటీకే)తో ఇక్కడి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–5 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. గోల్స్ పరంగా ఐఎస్ఎల్లో కోల్‌కతా జట్టుకిదే పెద్ద విజయం. 2015లో గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4–0తో నెగ్గింది. తాజా గెలుపుతో కోల్‌కతా ఆ రికార్డును సవరించింది. హైదరాబాద్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున డేవిడ్ విలియమ్స్ (25వ, 44వ నిమిషాల్లో), గార్సియా (88వ, 90+4వ నిమిషంలో) చెరో రెండు గోల్స్ చేయగా... కృష్ణా రాయ్ (27వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. మ్యాచ్‌లో బంతి ఎక్కువ శాతం కోల్‌కతా ఆధీనంలోనే ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఒడిశాతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు తలపడుతుంది. -
అక్టోబర్ 3 నుంచి ఐఎస్ఎల్
న్యూఢిల్లీ : రెండో అంచె ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 20 వరకు పోటీలు జరుగుతాయి. ఇంటా, బయటా పద్ధతిలో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడనున్నారు. చెన్నైలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా... చెన్నైయిన్ ఎఫ్‌సీతో తలపడుతుంది. -
కోల్‌కతా, చెన్నైయిన్ మ్యాచ్ డ్రా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పటిష్ట జట్లుగా పేరు తెచ్చుకున్న అట్లెటికో డి కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్లు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాయి. ఫలితంగా మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఇరు జట్ల నుంచి నమోదైన గోల్స్ పెనాల్టీ కిక్ ద్వారానే రావడం విశేషం. మ్యాచ్ ఆద్యంతం కోల్‌కతా ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ చెన్నైయిన్ ఆటగాళ్లు మాత్రం పట్టు వీడకుండా పోరాడారు. పరాజయం ఖాయమనుకున్న దశలో చెన్నైయిన్ స్టార్ స్ట్రయికర్ ఎలనో బ్లూమర్ (90+3 నిమిషంలో) పెనాల్టీ కిక్‌తో స్కోరును సమయం చేశాడు. అంతకుముందు కోల్‌కతా తరఫున 35వ నిమిషంలో లూయిస్ గ్రేసియా కూడా పెనాల్టీ కిక్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రస్తుతం 12 పాయింట్లతో కోల్‌కతా అగ్రస్థానంలో ఉండగా చెన్నైయిన్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
అట్లెటికో డి కోల్‌కతా
ఐఎస్ఎల్లో గంగూలీ జట్టు పేరు ప్రకటన ఆవిష్కరించిన ‘మాడ్రిడ్’ యజమాని కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీ పేరు ఖరారైంది. ‘అట్లెటికో డి కోల్‌కతా’గా నామకరణం చేసిన ఈ ఫ్రాంచైజీ పేరును బుధవారం జట్టు సహ యజమాని, అట్లెటికో డి మాడ్రిడ్ యజమాని అయిన మిగెల్ ఏంజెల్ గిల్ మారిన్ ఆవిష్కరించారు. ఫ్రాంచైజీ సహ యజమానులైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, సంజీవ్ గోయెంకా, హర్షవర్ధన్ నియోటియా, ఉత్సవ్ పరేఖ్లు హాజరయ్యారు. భారత్‌లో ఎనిమిది నగరాల ఫ్రాంచైజీలతో ఏర్పాటైన ఐఎస్ఎల్లో మొట్ట మొదటిగా కోల్‌కతా తమ పేరును ప్రకటించినట్లయింది. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఐఎస్ఎల్ ద్వారా దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, లీగ్‌తోపాటు అకాడమీలనూ ఏర్పాటు చేసి నైపుణ్యాన్ని వెలికి తీస్తామని తెలిపాడు. లీగ్ ప్రారంభానికి ముందు కోల్‌కతాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సిందిగా అట్లెటికో డి మాడ్రిడ్ జట్టును కోరతామన్నాడు. భారత్‌లో క్రికెట్‌కున్న ఆదరణ కొనసాగుతూనే ఫుట్‌బాల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.