వడోదర: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అతుల్ బెదాడే తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాడు. తాను కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమ్ క్రికెటర్లతో అతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. దాంతో బెదాడేను సస్పెండ్ చేస్తున్నట్లు బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) ప్రకటించింది. ఈ మేరకు బెదాడేకు లేఖ రాసిన కార్యదర్శి అజిత్ లెలె పలు అంశాలు వెల్లడించారు. ‘మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయడంలాంటివి’... బెదాడేపై వచ్చిన ప్రధాన ఆరోపణలని ఆయన చెప్పారు. క్రికెటర్ల రాతపూర్వక ఫిర్యాదు తర్వాత తాము విచారణ జరపడంతో అనేక విషయాలు బయటపడ్డాయని లెలె పేర్కొన్నారు. ప్రస్తుతానికి సస్పెండ్ చేసినా... ఈ అంశంపై ఇక ముందు పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా బీసీఏ ప్రకటించింది. 53 ఏళ్ల అతుల్ బెదాడే 1994లో భారత్ తరఫున 13 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment