భారత్ కు ఆసీస్ క్రికెటర్లు రాక
చెన్నై:భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు శుక్రవారం చెన్నైకు చేరుకున్నారు. ఆసీస్ పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఆటగాళ్లు అరోన్ ఫించ్, కౌల్టర్ నైల్, జేమ్స్ ఫల్కనర్, ట్రావిస్ హెడ్, స్టోనిస్, ఆడమ్ జంపా, రిచర్డ్ సన్ లు ముందుగా భారత్ కు చేరుకున్న వారిలో ఉన్నారు. వీరంతా ఆస్ట్రేలియా నుంచి సింగపూర్ మీదుగా చెన్నైకు చేరుకున్నారు. కాగా, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్లు మాత్రం శనివారం సాయంత్రానికి భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న ఆసీస్ జట్టులోని పలువురి ఆటగాళ్లు భారత్ కు రానున్నారు.
భారత్ -ఆసీస్ జట్ల మధ్య సెప్టెంబర్ 17వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ కు ముందు సెప్టెంబర్ 13 వ తేదీన బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో ఆసీస్ జట్టు వార్మప్ వన్డే ఆడనుంది. మొత్తం పర్యటనలో ఐదు వన్డేలతో పాటు, మూడు ట్వంటీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి.