ఆసీస్‌దే తొలి వన్డే
59 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి
సౌతాంప్టన్ : మాథ్యూ వేడ్ (50 బంతుల్లో 71 నాటౌట్; 12 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (67 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించడంతో గురువారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 59 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. రోస్ బౌల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు చేసింది. బర్న్స్ (44), వార్నర్ తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. స్మిత్ (44), మార్ష్ (40 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. వార్నర్, స్మిత్ రెండో వికెట్‌కు 57 పరుగులు జోడిస్తే.. చివర్లో వేడ్, మార్ష్‌లు ఏడో వికెట్‌కు 13 ఓవర్లలో అజేయంగా 112 పరుగులు సమకూర్చడంతో భారీ స్కోరు సాధ్యమైంది.
ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటై ఓడింది. రాయ్ (64 బంతుల్లో 67; 11 ఫోర్లు) టాప్ స్కోరర్. టేలర్ (49), మోర్గాన్ (38) మినహా మిగతా వారు నిరాశపర్చారు. టాప్ ఆర్డర్ నిలకడతో ఓ దశలో ఇంగ్లండ్ 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. అయితే మిడిల్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో 52 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్, కోల్టర్‌నీల్, కమిన్స్, వాట్సన్ తలా రెండు వికెట్లు తీశారు. వేడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.