నాగ్ పూర్:టీమిండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో తమ క్రికెటర్లు బెదిరిపోయిన కారణంగా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్ స్పష్టం చేశాడు. వన్డే సిరీస్ లో తమ ఆటగాళ్లు పదే పదే తప్పులు చేయడానికి కారణం భారత జట్టును ఎదుర్కోలేమనే భయం వారిలో జీర్ణించుకుపోవడమేనన్నాడు. దీనికి కారణంగా భారీ భాగస్వామ్యాలను నమోదు చేయడంలో ఆసీస్ విఫలమైందన్నాడు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ ను దారుణంగా ముగించాల్సి వచ్చిందని డేవిడ్ సాకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'మనం ఎక్కడ గేమ్స్ ఆడుతున్నామనే దాన్ని బట్టి మైండ్ సెట్ ఉండాలి. అంతేకానీ వ్యక్తిగతంగా భయపడుతూ గేమ్స్ కు సిద్ధం కాకూడదు. మా క్రికెటర్లలో చాలామంది భారత జట్టును చూసి ముందుగానే భయపడ్డారనేది వన్డే సిరీస్ ద్వారా అర్ధమైంది. ఇక దానికి ముగింపు పలకాలి. సానుకూల ధోరణితో, మరింత స్వేచ్చగా ఆడే అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి. అప్పుడే రాణిస్తాం. జట్టులో టాలెంట్ ఉంది.. కానీ ఫామ్ చూస్తే చాలా ఘోరంగా ఉంది. వన్డే సిరీస్ లో ఎప్పుడైతే వికెట్లను చేజార్చుకున్నామో ఇక కుదురుకునే యత్నం చేయ లేదు. మూర్ఖంగా ఒకరి వెంట ఒకరు క్యూకట్టాం. ఇన్నింగ్స్ నిలబెట్టే యోచన చేయ లేదు. ఇక ముందు సమష్టి ప్రదర్శనపై దృష్టి సారించండి. మీలో ఉన్న ఫామ్ ను వెలికితీయండి'అని ఆసీస్ క్రికెటర్లకు డేవిడ్ సాకర్ హితబోధ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment