david saker
-
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ కీలక నిర్ణయం!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'కోచింగ్ కన్సల్టెంట్స్'గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మైఖేల్ హస్సీ, డేవిడ్ సేకర్లను ఈసీబీ నియమించింది. ఈ మెగా ఈవెంట్లో వీరిద్దరూ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్ మాథ్యూ మాట్‌తో కలిసి పనిచేయనున్నారు. కాగా ఇప్పటికే రిచర్డ్ డాసన్, కార్ల్ హాప్కిన్సన్ రూపంలో ఇంగ్లండ్‌కు ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నారు. కాగా మైఖేల్ హస్సీ, డేవిడ్‌కు సేకర్‌లకు గతంలో కోచ్‌లగా పనిచేసిన అనుభవం ఉంది. మైఖేల్ హస్సీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. ఇక సేకర్ 2010 నుంచి 2015 వరకు ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇక ఇప్పటికే ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టుకు ఈసీబీ ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్ పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ నుంచే ఇంగ్లండ్ జట్టుతో హస్సీ,సేకర్ల ప్రయాణం ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అలెక్స్ హేల్స్. రిజర్వ్: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టైమల్ మిల్స్. చదవండి: T20 World Cup 2022: 'ఆ ముగ్గురు ఐపీఎల్లో అదరగొట్టారు.. భారత జట్టులో ఉండాల్సింది' -
బాల్ టాంపరింగ్: ఇక్కడితో ఆగిపోయేలా లేదు
సిడ్నీ: 2018లో ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ క్రికెట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. తాజాగా బాన్‌క్రాఫ్ట్.. బాల్ టాంపరింగ్ విషయం స్మిత్, వార్నర్‌లతో పాటు మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మరోసారి విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బాల్ టాంపరింగ్ వివాదం ఇంకా ముగిసిపోలేదని..అది బాన్‌క్రాఫ్ట్‌తో ఆగిపోదని.. ఇంకా ముందుకు సాగుతుందని ఆసీస్ మాజీ బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ పేర్కొన్నాడు. ఆసీస్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సమయంలో ఆసీస్ బౌలింగ్ కోచ్‌గా డేవిడ్ సాకర్ ఉండడం విశేషం. డేవిడ్ సాకర్ స్పందిస్తూ.. ''ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ వివాదం చాలా మందిని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అది నేనైనా కావొచ్చు లేదా ఇంకెవరో కావొచ్చు. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని సీఏ విచారణ చేపట్టడం మంచిదే కావొచ్చు.. కానీ తప్పు చేయనివాళ్లు కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచారణలో భాగంగా రేపు నన్ను పాయింట్ అవుట్ చేయొచ్చు.. లేదంటే ఆ సమయంలో కోచ్‌గా ఉన్న డారెన్ లీమన్వైపు కూడా వెళ్లొచ్చు. ఈ విచారణతో వాళ్లు(సీఏ) ఎక్కడిదాకా వెళతారో నాకు తెలియదు.. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇది బాన్‌క్రాఫ్ట్‌తో ముగిసిపోలేదు.. ఇది ఎప్పటికి ఆగిపోదు.. ముందుకు సాగుతూనే ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు అతనికి బౌలింగ్ చేస్తే.. అమ్మాయిని ఇంప్రెస్ చేసినట్లే -
ఆసీస్ బౌలింగ్ కోచ్ రాజీనామా
సిడ్నీ: గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ సాకర్ తన పదవికి రాజీనామా చేశాడు. దాదాపు మూడు సీజన్ల నుంచి ఆసీస్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించిన సాకర్.. జట్టును వీడే సమయం ఇదేనని భావించి వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. ‘నేను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సేవలందించే క్రమంలో చాలా ఎంజాయ్ చేశా. మేటి బౌలర్లు ఉన్న జట్టుతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సాకర్ తెలిపాడు. ఇక ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. తొమ్మిది నెలల నుంచి డేవిడ్ సాకర్‌తో కలిసి పని చేస్తున్నా. డేవిడ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జట్టులో చెరగని ముద్ర వేసిన సాకర్‌కు ధన్యవాదాలు. ఆసీస్ పేస్ బౌలింగ్‌ను మరింత పటిష్టం చేయడంలో సాకర్ పాత్ర వెలకట్టలేదని. ఆసీస్ జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ అతని సుదీర్ఘ పయనం చేశాడు’ అని లాంగర్ తెలిపాడు. వరల్డ్‌కప్‌కు మరికొన్న నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో డేవిడ్ సాకర్ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను ఒక్కసారిగా డైలమాలో పడేసింది. అయితే గతంతలో ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న ట్రాయ్ కూలీని భారత్, పాకిస్తాన్లతో సిరీస్‌లకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ట్రాయ్ కూలీనే వరల్డ్‌కప్ వరకూ కోచ్‌గా బౌలింగ్ కొనసాగిస్తుందా..లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
'భారత్ పై మా క్రికెటర్లు భయపడ్డారు'
నాగ్ పూర్:టీమిండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో తమ క్రికెటర్లు బెదిరిపోయిన కారణంగా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా తాత్కాలిక చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్ స్పష్టం చేశాడు. వన్డే సిరీస్ లో తమ ఆటగాళ్లు పదే పదే తప్పులు చేయడానికి కారణం భారత జట్టును ఎదుర్కోలేమనే భయం వారిలో జీర్ణించుకుపోవడమేనన్నాడు. దీనికి కారణంగా భారీ భాగస్వామ్యాలను నమోదు చేయడంలో ఆసీస్ విఫలమైందన్నాడు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ ను దారుణంగా ముగించాల్సి వచ్చిందని డేవిడ్ సాకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'మనం ఎక్కడ గేమ్స్ ఆడుతున్నామనే దాన్ని బట్టి మైండ్ సెట్ ఉండాలి. అంతేకానీ వ్యక్తిగతంగా భయపడుతూ గేమ్స్ కు సిద్ధం కాకూడదు. మా క్రికెటర్లలో చాలామంది భారత జట్టును చూసి ముందుగానే భయపడ్డారనేది వన్డే సిరీస్ ద్వారా అర్ధమైంది. ఇక దానికి ముగింపు పలకాలి. సానుకూల ధోరణితో, మరింత స్వేచ్చగా ఆడే అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి. అప్పుడే రాణిస్తాం. జట్టులో టాలెంట్ ఉంది.. కానీ ఫామ్ చూస్తే చాలా ఘోరంగా ఉంది. వన్డే సిరీస్ లో ఎప్పుడైతే వికెట్లను చేజార్చుకున్నామో ఇక కుదురుకునే యత్నం చేయ లేదు. మూర్ఖంగా ఒకరి వెంట ఒకరు క్యూకట్టాం. ఇన్నింగ్స్ నిలబెట్టే యోచన చేయ లేదు. ఇక ముందు సమష్టి ప్రదర్శనపై దృష్టి సారించండి. మీలో ఉన్న ఫామ్ ను వెలికితీయండి'అని ఆసీస్ క్రికెటర్లకు డేవిడ్ సాకర్ హితబోధ చేశాడు. -
ఆసీస్ ప్రదర్శనపై కోచ్ అసంతృప్తి
బెంగళూరు:టీమిండియాతో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ అది ఆ జట్టు చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్ కు మాత్రం పెద్దగా సంతృప్తినివ్వలేదు. ఇది ఆసీస్ జట్టు గొప్ప ప్రదర్శన ఎంతమాత్రం కాదనే అభిప్రాయాన్ని సాకర్ వ్యక్తం చేశాడు. 'ఆసీస్ గెలిచింది అంతవరకూ ఓకే. కానీ మా పూర్తిస్థాయి ప్రదర్శన అయితే ఇది కాదు. ఇది మా గొప్ప ప్రదర్శనల్లో ఎంతమాత్రం ఒకటిగా నిలవదు. మేము 43 ఓవర్ వరకూ బాగా ఆడాం. కానీ మా ఇన్నింగ్స్ ముగింపు సరిగా లేదు. మేము అనుకున్న దాన్ని మాత్రం చేరలేకపోయాం. కాకపోతే మ్యాచ్ గెలవడంతో మా ఆటగాళ్లు ఆనందంగా ఉన్నారు'అని డేవిడ్ సాకర్ పేర్కొన్నాడు. తమ బౌలింగ్ ఆరంభంలో తీవ్రంగా నిరాశపరిచిందని, చివర్లో మాత్రం బౌలర్లు ఆకట్టుకోవడంతో మ్యాచ్ ను గెలిచామన్నాడు. ప్రధానంగా స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్ పై కోచ్ ప్రశంసలు కురిపించాడు. దూకుడుతో కూడిన బౌలింగ్ ను జంపా వేయడంతో భారత జట్టును పరుగులు చేయకుండా నియంత్రించామన్నాడు. అతను వేసిన కొన్ని చక్కటి బంతులతో మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చిందని ప్రశంసించాడు. -
ఆసీస్ ప్రధాన కోచ్‌గా సేకర్..
రాంచీ:ప్రస్తుత భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు డారెన్ లీమన్ ప్రధాన కోచ్ వ్యవహరిస్తున్నప్పటికీ, ఈ ఏడాది మధ్యలో మరోసారి ఇక్కడకు రానున్న ఆసీస్ జట్టుకు కోచ్ గా డేవిడ్ సేకర్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ మేరకు భారత్ తో వన్డే సిరీస్ కు సంబంధించి తమ జట్టు ప్రధాన కోచ్ గా డేవిడ్ సేకర్ వ్యవహరించనున్న విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. ' భారత్ లో ఆసీస్ వన్డే పర్యటనకు సంబంధించి డేవిడ్ సేకర్ ను ప్రధాన కోచ్ గా నియమిస్తున్నాం. ప్రస్తుతం ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఉన్న డేవిడ్ సేకర్ భారత పర్యటనలో ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తాడు. డారెన్ లీమన్ ఆరోగ్య సమస్యలు కారణంగా అతని స్థానంలో భారత్ పర్యటనకు సేకర్ ను నియమిస్తున్నాం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డారెన్ లీమన్ కు బ్లడ్ థిన్నింగ్ థెరఫీ తీసుకుంటున్నాడు. దాంతో విమాన ప్రయాణాలను తగ్గించాల్సి ఉంది. దానిలో భాగంగానే లీమన్ స్థానంలో సేకర్ ను ప్రధాన కోచ్ గా భారత పర్యటనకు నియమించనున్నాం'అని సీఏ తెలిపింది. ఇంకా తేదీలు, వేదికలు ఖరారు కానీ భారత్ తో వన్డే సిరీస్ కు సేకర్ ప్రతిభకు పరీక్షగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకూ డారెన్ లీమన్ పర్యవేక్షణలో ఆసీస్ జట్టు అనేక అద్భుత విజయాల్ని సాధించింది. రాబోవు పర్యటనలో సేకర్ అదే స్థాయిలో కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తే అతన్నే పూర్తిస్థాయి కోచ్ గా చేసే అవకాశాలున్నాయి.