ఆసీస్ ప్రధాన కోచ్గా సేకర్..
రాంచీ:ప్రస్తుత భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు డారెన్ లీమన్ ప్రధాన కోచ్ వ్యవహరిస్తున్నప్పటికీ, ఈ ఏడాది మధ్యలో మరోసారి ఇక్కడకు రానున్న ఆసీస్ జట్టుకు కోచ్ గా డేవిడ్ సేకర్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ మేరకు భారత్ తో వన్డే సిరీస్ కు సంబంధించి తమ జట్టు ప్రధాన కోచ్ గా డేవిడ్ సేకర్ వ్యవహరించనున్న విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది.
' భారత్ లో ఆసీస్ వన్డే పర్యటనకు సంబంధించి డేవిడ్ సేకర్ ను ప్రధాన కోచ్ గా నియమిస్తున్నాం. ప్రస్తుతం ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా ఉన్న డేవిడ్ సేకర్ భారత పర్యటనలో ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తాడు. డారెన్ లీమన్ ఆరోగ్య సమస్యలు కారణంగా అతని స్థానంలో భారత్ పర్యటనకు సేకర్ ను నియమిస్తున్నాం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డారెన్ లీమన్ కు బ్లడ్ థిన్నింగ్ థెరఫీ తీసుకుంటున్నాడు. దాంతో విమాన ప్రయాణాలను తగ్గించాల్సి ఉంది. దానిలో భాగంగానే లీమన్ స్థానంలో సేకర్ ను ప్రధాన కోచ్ గా భారత పర్యటనకు నియమించనున్నాం'అని సీఏ తెలిపింది.
ఇంకా తేదీలు, వేదికలు ఖరారు కానీ భారత్ తో వన్డే సిరీస్ కు సేకర్ ప్రతిభకు పరీక్షగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకూ డారెన్ లీమన్ పర్యవేక్షణలో ఆసీస్ జట్టు అనేక అద్భుత విజయాల్ని సాధించింది. రాబోవు పర్యటనలో సేకర్ అదే స్థాయిలో కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తే అతన్నే పూర్తిస్థాయి కోచ్ గా చేసే అవకాశాలున్నాయి.