బెంగళూరు:టీమిండియాతో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ అది ఆ జట్టు చీఫ్ కోచ్ డేవిడ్ సాకర్ కు మాత్రం పెద్దగా సంతృప్తినివ్వలేదు. ఇది ఆసీస్ జట్టు గొప్ప ప్రదర్శన ఎంతమాత్రం కాదనే అభిప్రాయాన్ని సాకర్ వ్యక్తం చేశాడు. 'ఆసీస్ గెలిచింది అంతవరకూ ఓకే. కానీ మా పూర్తిస్థాయి ప్రదర్శన అయితే ఇది కాదు. ఇది మా గొప్ప ప్రదర్శనల్లో ఎంతమాత్రం ఒకటిగా నిలవదు. మేము 43 ఓవర్ వరకూ బాగా ఆడాం. కానీ మా ఇన్నింగ్స్ ముగింపు సరిగా లేదు. మేము అనుకున్న దాన్ని మాత్రం చేరలేకపోయాం. కాకపోతే మ్యాచ్ గెలవడంతో మా ఆటగాళ్లు ఆనందంగా ఉన్నారు'అని డేవిడ్ సాకర్ పేర్కొన్నాడు. తమ బౌలింగ్ ఆరంభంలో తీవ్రంగా నిరాశపరిచిందని, చివర్లో మాత్రం బౌలర్లు ఆకట్టుకోవడంతో మ్యాచ్ ను గెలిచామన్నాడు.
ప్రధానంగా స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్ పై కోచ్ ప్రశంసలు కురిపించాడు. దూకుడుతో కూడిన బౌలింగ్ ను జంపా వేయడంతో భారత జట్టును పరుగులు చేయకుండా నియంత్రించామన్నాడు. అతను వేసిన కొన్ని చక్కటి బంతులతో మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చిందని ప్రశంసించాడు.