‘పాంచ్’ పటాకా... | Australia beat England by 281 runs, win Ashes series 5-0 | Sakshi
Sakshi News home page

‘పాంచ్’ పటాకా...

Published Mon, Jan 6 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

‘పాంచ్’ పటాకా...

‘పాంచ్’ పటాకా...

 సిడ్నీ: ‘యాషెస్ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఇద్దరు కెప్టెన్లు ఎవరో తెలుసా?’... ఐదో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టు సారథి మైకేల్ క్లార్క్‌కు ఎదురైన ప్రశ్న ఇది. అయితే దీనికి తడముకోకుండా వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, రికీ పాంటింగ్ అని ఠక్కున సమాధానమిచ్చాడు. కానీ మూడు రోజులు ముగిసేసరికి ఈ సంఖ్య ముగ్గురికి చేరుకుంది. ఇంగ్లండ్ చివరి బ్యాట్స్‌మన్ రాన్‌కిన్ క్యాచ్‌ను క్లార్క్ అద్భుతంగా అందుకోవడంతో ఐదో టెస్టులో ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.
 
  ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (5-0) చేసింది. సూపర్ సారథిగా క్లార్క్ చరిత్రలో భాగమయ్యాడు. వెనువెంటనే ఆసీస్ జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. బ్రిస్బేన్‌లో మొదలైన క్లార్క్ సేన జైత్రయాత్ర సిడ్నీలో దిగ్విజయంగా ముగించింది. కేవలం 21 రోజుల్లోనే సిరీస్‌ను స్వీప్ చేసింది. 2006-07లో పాంటింగ్ బృందానికి 22 రోజులు పట్టగా... 1920-21లో ఆర్మ్‌స్ట్రాంగ్ జట్టుకు 24 రోజుల సమయం అవసరమైంది.
 
 ఆసీస్ నిర్దేశించిన 484 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదివారం మూడో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 31.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్‌లో 200లోపు పరుగులకు అవుట్‌కావడం పర్యాటక జట్టుకు ఇది ఆరోసారి. కార్‌బెరీ (63 బంతుల్లో 43; 8 ఫోర్లు) టాప్ స్కోరర్. బ్రాడ్ (36 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టోక్స్ (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు.
 
 అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 140/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 61.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. రోజర్స్ (119; 15 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీ సాధించాడు. బెయిలీ (74 బంతుల్లో 46; 6 ఫోర్లు), హాడిన్ (28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రోజర్స్, బెయిలీ ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. బోర్త్‌విక్ 3, అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
 
 టప..టపా..
 లంచ్ తర్వాత కొద్దిసేపటికి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ షరా మామూలుగానే సాగింది. ఆసీస్ బౌలింగ్‌కు ఎదురు నిలువలేక చకచకా వికెట్లు కోల్పోయింది. కార్‌బెరీ నిలబడే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్‌లో కుక్ (7), బెల్ (16), పీటర్సన్ (6) పూర్తిగా నిరాశపర్చారు. దీంతో టీ విరామానికి ఇంగ్లండ్ 87 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే టీ తర్వాత కంగారూలు మరోసారి అద్భుత బౌలింగ్, ఫీల్డింగ్‌తో చెలరేగారు.
 
  కేవలం రెండు ఓవర్ల వ్యవధిలో కార్‌బెరీ, బాలెన్సీ (7), బెయిర్‌స్టో (0), బోర్త్‌విక్ (4)లను అవుట్ చేసి ఓటమి అంచుల్లోకి నెట్టారు. అయితే బ్రాడ్, స్టోక్స్ వేగంగా ఆడుతూ ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు రాన్‌కిన్ (0) అవుట్ కావడంతో 166 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లను 52 నిమిషాల్లో కోల్పోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హారిస్ 5, జాన్సన్ 3, లియోన్ 2 వికెట్లు తీశారు. ఈ సిరీస్ మొత్తంలో జాన్సన్ 37 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
 
 సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 326; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 155; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 276 (రోజర్స్ 119, బెయిలీ 46, బోర్త్‌విక్ 3/33); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 166 (కార్‌బెరీ 43, హారిస్ 5/25, మిచెల్ జాన్సన్ 3/40, లియోన్ 2/70).
 
 ఏం చేయాలో తెలుసు...
 ‘నా మీద ఇంగ్లండ్ బోర్డుకు నమ్మకం ఉంది. కెప్టెన్‌గా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి భవిష్యత్‌లో జట్టును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ఇందుకు సరైన వ్యక్తిని నేనే. ఓ ఆటగాడిగా నాకు చాలా అనుభవం ఉంది. గతంలో కూడా ఇలాంటి పరాజయాలు చవిచూశా. తర్వాత పట్టుదలతో ఆడి గాడిలో పడ్డాం.
 
  కాబట్టి ఈసారి ఏం చేయాలో కూడా తెలుసు. ప్రతి ఆటగాడు వ్యక్తిగతంగా తన టెక్నిక్ గురించి తెలుసుకోవాలి. అలా చేస్తే జట్టును పునర్ నిర్మించడం చాలా సులువు. జట్టులో సమతుల్యం ఉన్నా... సరైన సమయంలో వినియోగించుకోలేకపోయాం. ఈ పర్యటన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రాథమికాంశాలకు కట్టుబడాలన్న నిర్ణయానికి వచ్చాం. సిరీస్ ఫలితంపై కోపం, ఆవేశం వస్తున్నా నియంత్రించుకుంటున్నా.’    
 - కుక్ (ఇంగ్లండ్ కెప్టెన్)
 
 మూడో ర్యాంక్‌లో ఆసీస్
 దుబాయ్: యాషెస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంక్‌ను కూడా గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఐదో ర్యాంక్‌తో సిరీస్‌ను మొదలుపెట్టిన క్లార్క్‌సేన తాజా ర్యాంకింగ్స్‌లో 10 రేటింగ్ పాయింట్లు సంపాదించి మూడో స్థానానికి (111) ఎగబాకింది. 9 రేటింగ్ పాయింట్లను కోల్పోయిన ఇంగ్లండ్ (107) నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది.
 
 నిలకడగా రాణించాలి
 ‘ప్రపంచ క్రికెట్‌లో ఆసీస్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. కాబట్టి దక్షిణాఫ్రికా టూర్‌కు మేం సిద్ధం. మా బౌలింగ్ రుచి వాళ్లకు చూపిస్తాం. విదేశాల్లో ఆడుతూ సరైన ఫలితాలు రాబట్టడం కష్టంతో కూడుకున్నది. అయితే మేం విజయవంతం అవుతామనే భావిస్తున్నా. ఒక్క సిరీస్‌తో సరిపెట్టుకోకుండా సుదీర్ఘ కాలం ఇంటా, బయటా నిలకడగా రాణించాలి. గతేడాదితో పోలిస్తే ఈసారి మా ప్రదర్శన బాగుంది. గతంలో యాషెస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్లకంటే మేం మరింత మెరుగ్గా ఆడాం. అయితే అప్పటి సమయం, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ జట్టు కెప్టెన్‌గా నాకు ఇది చాలా ప్రత్యేకమైంది’.     
 -క్లార్క్ (ఆసీస్ కెప్టెన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement