పరుగుల పోరులో ధోని సేన ఓటమి
క్రికెట్ గెలిచింది.. అవును.. సాధారణంగా వన్డేమ్యాచ్ లు జరిగాయంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఏ జట్టు గెలిచిందా అని అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ, మంగళవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మాత్రం నిజంగా క్రికెట్ గెలిచింది. ఇప్పటివరకు వన్డే చరిత్రలోనే ఎప్పుడూ ఒకేసారి ఇరుజట్లు 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం అన్నది నమోదు కాలేదు. కానీ, ఈ మ్యాచ్ లో తొలిసారిగా ఆ ఫీట్ నమోదై అసలు సిసలైన మజాను అందించింది. తొలుత టీమిండియా రెండో వికెట్ కు 207 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే... ఆ తరువాత ఆసీస్ మూడో వికెట్ కు 242 పరుగుల భాగస్వామ్యం సాధించింది. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పరుగుల పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆసీస్ ఆటగాళ్లలో జార్జ్ బెయిలీ(112; 120 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(149 ;135 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియా బౌలర్లలో బరిందర్ శ్రవణ్ మూడు వికెట్లు సాధించగా, అశ్విన్ కు రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా ఆదిలోనే శిఖర్ ధవన్(9)ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. కాగా, రోహిత్-కోహ్లిల ద్వయం ఆసీస్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ సుదీర్ఘంగా క్రీజ్ లో నిలిచారు. రోహిత్ శర్మ(171 నాటౌట్; 163 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగిపోయి ఆసీస్ బౌలర్లను ఊచకోత కోయగా, విరాట్ కోహ్లి(91;97బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఈ జంట రెండో వికెట్ కు 207 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పటిష్టస్థితికి చేరింది. అయితే జట్టు స్కోరు 243 వద్ద ఫాల్కనర్ బౌలింగ్ లో షాట్ కు యత్నించిన విరాట్ అవుటయ్యాడు. అనంతరం రోహిత్ కు జత కలిసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్కోరును ముందుకు తీసుకువెళ్లే క్రమంలో పెవిలియన్ చేరాడు. ధోని 13 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి మూడో వికెట్ గా అవుటయ్యాడు. చివరి ఓవర్ లో రవీంద్ర జడేజా(10) సాయంతో 14 పరుగులు రావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
మెరిసిన బరిందర్ శ్రవణ్
తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న బరిందర్ శ్రవణ్ మెరిశాడు. 9.2 ఓవర్లు వేసిన బరిందర్ 56 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ ఓపెనర్లు ఫించ్, డేవిడ్ వార్నర్ లను ఆదిలోనే పెవిలియన్ పంపి తనపై ధోని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన శ్రవణ్.. ఆట చివరి ఓవర్ లో కూడా వికెట్ పడగొట్టాడు. కాగా, అప్పటికే టీమిండియా ఓటమి ఖరారు కావడంతో ఇక చేసేది లేకపోయింది.
పెర్త్ లో రో'హిట్'
పేస్ కు స్వర్గధామమైన వాకా స్టేడియంలో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తరపున తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. దీంతో పాటు కెరీర్ లో తొమ్మిదో శతకాన్ని సాధించడమే కాకుండా, ఆస్ట్రేలియాలో మూడో వన్డే సెంచరీ చేశాడు. అంతకుముందు భారత్ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ ఒక్కేడే ఆస్ట్రేలియా పిచ్ లపై మూడో సెంచరీలను సాధించాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియాపై 19 వన్డే ఇన్నింగ్స్ లను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ (1027) వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 95. 53 ఉండగా, అతని సగటు 68.00కు పైగా ఉండటం విశేషం. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 209.
విశేషాలు..
*ఒక మ్యాచ్ లో ఇరు జట్లు రెండొందలకు పైగా పరుగులు నమోదు చేయడం వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
*ఆసీస్ పై రెండో వికెట్ కు భారత్ (207) అత్యధిక భాగస్వామ్యం ఇదే.
*రోహిత్ శర్మ 150 పరుగులకు పైగా చేయడం ఇది నాల్గో సారి. దీంతో క్రిస్ గేల్, జయసూర్యల సరసన రోహిత్ చేరాడు. సచిన్ ఐదుసార్లు 150కు పైగా పరుగులు చేశాడు.
* రోహిత్ శర్మ(171 నాటౌట్) సెంచరీ ఆసీస్ గడ్డపై ఓవరాల్ గా ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోరు
*ఆసీస్ పై ఆస్ట్రేలియాలో టీమిండియాకిదే ఇదే అత్యధిక స్కోరు(309). అంతకుముందు 2004 లో బ్రిస్బేన్ లో టీమిండియా 304 పరుగులను నమోదు చేసింది.
*ఈ మ్యాచ్ ద్వారా 200కు పైగా భాగస్వామ్యంలో విరాట్ కోహ్లి ఏడోసారి పాలుపంచుకున్నాడు.
*ఆసియా బయట టీమిండియా 200కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఎనిమిదోసారి. అంతకుముందు 2008-09లో చివరిసారి సెహ్వాగ్-గంబీర్ల జోడి హమిల్టన్ లో 201 పరుగుల భాగస్వామ్యం సాధించింది.