వోజెస్ సూపర్ డబుల్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 583/4 డిక్లేర్డ్ విండీస్ 207/6
హోబర్ట్: ఆడమ్ వోజెస్ (285 బంతుల్లో 269 నాటౌట్; 33 ఫోర్లు) కెరీర్‌లో తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదు చేయడంతో పాటు షాన్ మార్ష్ (266 బంతుల్లో 182; 15 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో వికెట్‌కు 449 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 114 ఓవర్లలో నాలుగు వికెట్లకు 583 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ గడ్డపై కూడా ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.
వారికన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను స్పిన్నర్ లియోన్ (3/43) దెబ్బతీశాడు. దీంతో రోజు ముగిసే సమయానికి 65 ఓవర్లలో ఆరు వికెట్లకు 207 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 376 పరుగులు వెనుకబడి ఉంది. డారెన్ బ్రేవో (159 బంతుల్లో 94 బ్యాటింగ్; 17 ఫోర్లు) ఒక్కడే పోరాడుతున్నాడు. అతనికి జతగా క్రీజులో రోచ్ (89 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు. హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.