ఆడనంటే... ఆడమంటోంది ఆసీస్‌  | Australia eager to host India for day-night Test at Adelaide | Sakshi
Sakshi News home page

ఆడనంటే... ఆడమంటోంది ఆసీస్‌ 

Published Tue, May 1 2018 12:49 AM | Last Updated on Tue, May 1 2018 12:49 AM

Australia eager to host India for day-night Test at Adelaide - Sakshi

సిడ్నీ: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్‌తో డే–నైట్‌ టెస్టు ఆడించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భాగంగా డిసెంబర్‌ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టును పింక్‌ బంతితో డే–నైట్‌ ఆడించాలని సీఏ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ విషయాన్ని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ ధ్రువీకరించారు. ‘మా ప్రాధాన్యం డే–నైట్‌ టెస్టే. అందుకోసమే మేం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్నప్పటికీ దీనిపై సానుకూల స్పందన వస్తుందనే ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు. అడిలైడ్‌లో గత మూడేళ్లుగా నాలుగు డే–నైట్‌ టెస్టులు జరిగాయి. కివీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల ఆట ఆడాయి. అలాగే ఈసారి  భారత్‌తో ఆడాలని సీఏ చర్చలు జరుపుతోంది. 

బీసీసీఐ ఆడనంటోంది: ఏటా తమ దేశంలో ఒక టెస్టు మ్యాచ్‌నైనా డే–నైట్‌ ఆడించాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంటే... బీసీసీఐ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఫ్లడ్‌లైట్ల టెస్టుపై భారత బోర్డు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. ఇది వరకే ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు తెలిపామని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

ఆసీస్‌లో భారత షెడ్యూలిదే: మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటన మొదలవుతోంది. నవంబర్‌ 21 నుంచి 25 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. డిసెంబర్‌ 6–10 వరకు అడిలైడ్‌లో తొలి టెస్టు, 14–18 వరకు పెర్త్‌లో రెండో టెస్టు, 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో ఆఖరి టెస్టు జరుగుతుంది. జనవరి 12 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్‌ ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement