క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ దృష్టి
ఉదయం గం. 5 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
సిడ్నీ: వరుస విజయాలతో ఊపుమీదున్న ఆస్ట్రేలియా జట్టు యాషెస్ సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టగా, ఇంగ్లండ్ పరువు కోసం పాకులాడుతోంది. ఎలాగైనా ఆఖరి టెస్టులో గెలిచి విజయంతో సిరీస్‌ను ముగించాలని కుక్‌సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి సిడ్నీలో ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జరగనుంది. నాలుగు టెస్టుల్లో అద్భుతంగా ఆడిన ఆసీస్.. ఈ మ్యాచ్‌లోనూ అదే హవాను కొనసాగించాలని సిద్ధమవుతోంది. ఇందుకోసం తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా మేనేజ్‌మెంట్ అంగీకరించడం లేదు.
అయితే వాట్సన్, పేసర్ హారిస్‌లు చిన్న గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లు అందుబాటులో ఉండేది లేనిది మ్యాచ్‌కు ముందే తెలియనుంది. ముందు జాగ్రత్తగా ఫాల్క్‌నర్, అలెక్స్ దూలన్‌లను పిలిపించారు. ‘ఐదు టెస్టులకు ఒకే జట్టును కొనసాగించడం చాలా గొప్ప విషయం. అయితే మ్యాచ్ గెలిచేందుకు అవసరమైన బెస్ట్ 11 మందిని సెలక్టర్లు ఎంపిక చేస్తారు. సిడ్నీలో మ్యాచ్ గెలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది’ అని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు.
మరోవైపు నాలుగో టెస్టులో అనూహ్య రీతిలో ఓటమిపాలైన కుక్‌సేన ఈ మ్యాచ్‌లోనూ ఓడితే 0-5తో సిరీస్ కోల్పోయిన మూడో ఇంగ్లండ్ జట్టుగా రికార్డులకెక్కుతుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో 15 మంది ఆటగాళ్లను ఉపయోగించిన ఇంగ్లండ్ ఐదో టెస్టుకూ జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
గ్యారీ బాలెన్సీ, స్కాట్ బోర్త్‌విక్, స్టీవెన్ ఫిన్‌లు జట్టులోకి రావొచ్చు. అయితే ఎంత మంది జట్టులోకి వస్తున్నా ఆసీస్ పేసర్ జాన్సన్ దాడిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. పీటర్సన్ ఫామ్‌లోకి వచ్చినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. దీంతో మిడిలార్డర్‌లో బెల్, స్టోక్స్, బెయిర్‌స్టోలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ లేకపోవడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. నాలుగో టెస్టులో అండర్సన్, బ్రాడ్, బ్రెస్నన్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నా నిలకడలేమీతో ఇబ్బందులుపడుతున్నారు. ప్రధాన స్పిన్నర్ స్వాన్ లేకపోవడంతో స్పిన్ విభాగం బలహీనపడింది.