ఆసీస్ లక్ష్యం 231 | Australia Target 231 in Ashes fourth test match | Sakshi
Sakshi News home page

ఆసీస్ లక్ష్యం 231

Published Sun, Dec 29 2013 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

లియోన్

లియోన్

మెల్‌బోర్న్: రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తడబడటంతో యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనిస్తోంది. కుక్‌సేన నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం మూడో రోజు బరిలోకి దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. రోజర్స్ (18 బ్యాటింగ్), వార్నర్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం క్లార్క్‌సేన గెలుపునకు 201 పరుగుల దూరంలో ఉంది.

అంతకుముందు 164/9 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 82.2 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 51 పరుగుల ఆధిక్యం లభించింది. హాడిన్ (65), లియోన్ (18 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు విలువైన 40 పరుగులు జోడించి అవుటయ్యాడు. అండర్సన్ 4, బ్రాడ్ 3, బ్రెస్నన్ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌ను స్పిన్నర్ లియోన్, జాన్సన్ వణికించారు. కట్టుదిట్టమైన బంతులతో పరుగులు నిరోధించారు. దీంతో కుక్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. కుక్ (51), పీటర్సన్ (49) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు.
 
 ఒక్క పరుగు తేడాతో కార్‌బెరీ (12), రూట్ (15), బెల్ (0) అవుట్ కావడంతో పర్యాటక జట్టు 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే పీటర్సన్... స్టోక్స్ (19)తో కలిసి ఐదో వికెట్‌కు 44; బెయిర్‌స్టో (21)తో కలిసి ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో లియోన్, జాన్సన్ మరోసారి విజృంభించడంతో ఇంగ్లండ్ చివరి ఐదు వికెట్లను ఆరు పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఐదు వికెట్లు తీసిన లియోన్ కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. జాన్సన్‌కు 3, సిడిల్‌కు ఒక్క వికెట్ లభించింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన పిన్నవయస్కుడిగా కుక్ రికార్డులకెక్కాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement