ఆసీస్ ఘనవిజయం
మాంచెస్టర్: యాషెస్‌ను ఘోరంగా ఓడినప్పటికీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు ఘనంగానే ఆరంభించింది. తొలి వన్డే వర్షార్పణం కాగా కెప్టెన్ మైకేల్ క్లార్క్ (102 బంతుల్లో 105; 14 ఫోర్లు) మెరుపు సెంచరీ సహాయంతో రెండో వన్డేను 88 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు సాధించింది.
తొలి ఓవర్‌లోనే షాన్ మార్ష్ వెనుదిరిగినా ఆసీస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. క్లార్క్, జార్జి బెయిలీ (67 బంతుల్లో 82; 5 ఫోర్లు; 4 సిక్స్) తుఫాన్ ఆటతీరుతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 155 పరుగుల భారీ స్కోరు లభించింది. ఫిన్, రాన్‌కిన్, బొపారాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది.