జోరు కొనసాగాలి! | Australia vs India T20 starts to day | Sakshi
Sakshi News home page

జోరు కొనసాగాలి!

Published Sun, Mar 30 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

జోరు కొనసాగాలి!

జోరు కొనసాగాలి!

ఆస్ట్రేలియాతో నేడు భారత్ ఢీ
 యువరాజ్ ఒక్కడే సమస్య
 కంగారూలపై ఆయుధం స్పిన్
 
 రా. గం. 7.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
 టి20ల్లో వరుసగా మ్యాచ్‌లు గెలిచి జోరు కొనసాగించడం చాలా ముఖ్యం. వరుసగా విజయాలు వస్తుంటే ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కనపడవు. కానీ ఒక్కసారి బ్రేక్ పడిందంటే... కోలుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి సెమీస్‌కు చేరామన్న అలసత్వం దరిచేరనీయకుండా ఆస్ట్రేలియాపైనా భారత్ గెలిస్తే.... సెమీఫైనల్లో మరింత ధీమాగా ఆడొచ్చు.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిసారి టి20 మ్యాచ్ 2013 అక్టోబరు 10న రాజ్‌కోట్‌లో జరిగింది. తొలుత ఆస్ట్రేలియా ఏకంగా 201 పరుగుల భారీస్కోరు చేస్తే... భారత్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి నెగ్గింది. ఈ మ్యాచ్ గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.... యువరాజ్ కోసం. ఆ మ్యాచ్‌లో యువరాజ్ కేవలం 35 బంతుల్లో అజేయంగా 77 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు. టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడిన ఆఖరి అంతర్జాతీయ టి20 అదే.
 
 
 వన్డే జట్టులో స్థానం లేకపోయినా యువరాజ్ టి20ల్లో కొనసాగడానికి కారణం ఆ మ్యాచే. టి20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం జట్టుకు కనిపిస్తున్న ఒకే ఒక సమస్య యువరాజ్. పేరుకు ఆల్‌రౌండర్ అయినా బౌలర్‌గా ఉపయోగపడటం లేదు. ఇక బ్యాటింగ్‌లోనూ గాడిలో పడలేదు. కనీసం ఆస్ట్రేలియాతో ఆడిన చివరి మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే యువీ ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు.
 
 ఇక యువీని పక్కన పెడితే... ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో భారత జట్టు సూపర్-10 దశలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై స్పిన్ ఆయుధాన్నే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. స్పిన్ ఆడే విషయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బలహీనతను ధోనిసేన సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అటు ఆస్ట్రేలియా వరుసగా రెండు హై స్కోరింగ్ మ్యాచ్‌లలో చివర్లో బోల్తాపడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌పై గెలిస్తే తప్ప ఆస్ట్రేలియాకు సెమీస్ అవకాశాలు లేవు. ఒకవేళ అలాంటి సంచలనం జరిగినా... ఆసీస్ రేస్‌లో ఉండాలంటే భారత్‌పై భారీగా గెలవాలి. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఇది అసాధ్యమే అనుకోవాలి.
 
 జట్లు (అంచనా)
 భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మిశ్రా.
 
 ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), వార్నర్, ఫించ్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హాడ్జ్, హాడిన్, ఫాల్క్‌నర్, ముర్హెడ్, స్టార్క్, బొలింజర్.
 
 టోర్నీకి మేం ఫేవరెట్స్‌గా రాలేదు. కానీ నిలకడగా ఆడి సెమీస్‌కు చేరాం. ఏ జట్టైనా తమ బలానికి తగ్గ జట్టుతోనే బరిలోకి దిగుతుంది. పరిస్థితులను సరిగా ఉపయోగించుకోవడం టి20ల్లో కీలకం. టాస్ గెలిస్తే మళ్లీ బౌలింగ్ చేస్తాం. మంచు ప్రభావం ఉంటున్నా... టి20ల్లో దాని గురించి వన్డేల స్థాయిలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతం జట్టు మంచి ఉత్సాహంతో ఉంది.
 - అశ్విన్
 
 4 భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇప్పటివరకూ ఎనిమిది టి20లు జరిగాయి. ఇరు జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు గెలిచాయి.
 
1 టి20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా భారత్ ఒకటి గెలిచింది. ఆసీస్ రెండింట నెగ్గింది.
 
 ప్రయోగాలు లేనట్లే (నా)!
 భారత జట్టు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కూడా రిజర్వ్ బెంచ్‌లో ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే సూచనలు  కనిపించడం లేదు. ఆ రోజు మ్యాచ్ కోసం అందుబాటులో ఉన్న ఉత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతామని, ప్రత్యేకంగా రిజర్వ్‌ల కోసం మార్పులు ఉండవని అశ్విన్ చెప్పాడు. అంటే ధోనిసేన వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన కాంబినేషన్‌తోనే ఈ మ్యాచ్ కూడా ఆడనుంది. శనివారం ధోనిసేన సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసింది. రొటీన్‌కు భిన్నంగా ఈసారి నెట్స్‌లో ప్రాక్టీస్ తర్వాత ఫుట్‌బాల్ ఆడారు.
 
  మ్యాక్స్‌వెల్‌పై ఆశలు
 వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ సంచలన ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్‌పై ఆస్ట్రేలియా మరోసారి ఆశలు పెట్టుకుంది. నిజానికి వార్నర్, ఫించ్, బెయిలీ, హాడ్జ్, వాట్సన్... ఇలా ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. ఈ టోర్నీలో ఇంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఏ జట్టుకూ లేదు. కానీ సమష్టిగా రాణించడంలో విఫలమై నిరాశనే మిగుల్చుకున్నారు. ఇక బౌలింగ్ విభాగమే ఈ జట్టుకు సమస్య. పిచ్‌లు స్పిన్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో ఈ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటు. అందుకే మరోసారి పేసర్లపైనే భారం వేసింది.
 
 ‘టాప్’ లక్ష్యం
 ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ గ్రూప్ ‘2’లో అగ్రస్థానంలో నిలుస్తుంది. తద్వారా గ్రూప్ ‘1’లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడొచ్చు. ప్రస్తుత సమీకరణాలను బట్టి గ్రూప్-1లో శ్రీలంక అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్‌లో భారత్ జట్టు 5 పరుగులతో లంక చేతిలో ఓడింది. ప్రస్తుత బంగ్లాదేశ్ పర్యటనలో భారత్‌కు ఎదురైన ఒకే ఒక్క ఓటమి. కాబట్టి ఆస్ట్రేలియాపై గెలిచి అగ్రస్థానంలో నిలిస్తే... గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడొచ్చు. అప్పుడు ఫైనల్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
 
  పాక్‌కు చావోరేవో
 గ్రూప్ ‘2’లో భారత్ సెమీస్‌కు చేరినందున... ఇక ఒక్క జట్టుకే నాకౌట్ అవకాశం ఉంది. వెస్టిండీస్ రెండు గెలిచి ముందంజలో ఉంది. కాబట్టి పాక్ కచ్చితంగా రెండు మ్యాచ్‌ల్లోనూ (ఒకటి వెస్టిండీస్‌తో) గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్ ఆ జట్టుకు చావోరేవో లాంటిది. ఈ నేపథ్యంలో ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో హఫీజ్ సేన తలపడుతుంది. మరోవైపు స్వదేశంలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని బంగ్లాదేశ్ తాపత్రయపడుతోంది.
 మ. గం. 3.00 నుంచి  
 స్టార్ స్పోర్ట్స్-1లో లైవ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement