సిడ్నీ: తమ దేశ పర్యటనలో టీమిండియాకు అసలు సిసలు సవాల్ ఎదురుకాబోతుందని అంటున్నాడు ఆసీస్ మాజీ సారథి స్టీవ్ వా. ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా తమ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉన్న కారణంగా కోహ్లి సేనకు కఠిన పరీక్ష తప్పదన్ని పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించడమంటే సులభం కాదు. మా జట్టులో కొందరు ప్రధాన ఆటగాళ్లు దూరమైనప్పటికీ, ప్రస్తుత ప్రపంచ జట్లలో పోలిస్తే మా బౌలింగే అత్యంత బలంగా ఉందనేది వాస్తవం. మా పిచ్‌లు మా బౌలర్లకు కొట్టొచ్చిన పిండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు సాధించగల సామర్థ్యం మా బౌలర్ల సొంతం. ఒకవేళ మేము తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేస్తే చాలు.. మాపై గెలవడం కష్టంతో కూడుకున్న పని. ఈ ద్వైపాక్షిక సిరీస్ హోరీహోరీగా సాగినప్పటికీ మాదే పైచేయి అవుతుందని అనుకుంటున్నా’ అని స్టీవ్ తెలిపాడు.
ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై స్టీవ్ ప‍్రశంసలు కురిపించాడు. కోహ్లి ఒక అసాధారణ ఆటగాడిగా అభివర్ణించిన స్టీవ్ వా.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ‍్రియాన్ లారా తరహా ఆటగాడు కోహ్లి అని పేర్కొన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌కు రాబోయే భారత జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కోహ్లినే అత్యంత ప్రమాదకర ఆటగాడన్నాడు. మరొకవైపు గత 15 ఏళ్లలో తాను చూసిన అత్యుత్తమ భారత జట్టు ఇదేనన్న కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలతో మాత్రం వా ఏకీభవించలేదు. ఇదే అత్యుత్తమ భారత జట్టు అని తాను కచ్చితంగా చెప్పలేనన్నాడు.
ఇక్కడ చదవండి: ఆసీస్-టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment