ఆసీస్ అదుర్స్
సిడ్నీ: దాదాపు మూడు నెలల తమ ఆస్ట్రేలియా పర్యటనను ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాలతో ముగించింది. యాషెస్ సిరీస్‌లో ప్రారంభమైన పరాభవాలు ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ కొనసాగి చివరికి టి20 సిరీస్‌తో ముగిశాయి. ఈ మొత్తం 13 మ్యాచ్‌ల్లో వారికి దక్కింది కేవలం ఒక్క వన్డే విజయం మాత్రమే. తాజాగా ఇరు జట్ల మధ్య మూడోదైన చివరి టి20లో స్టువర్ట్ బ్రాడ్ బృందం 84 పరుగుల తేడాతో మట్టికరిచింది.
దీంతో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఆస్ట్రేలియా 3-0తో టి20 సిరీస్‌ను తమ ఖాతాలో జమచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ జార్జి బెయిలీ (20 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు; 3 సిక్స్), ఓపెనర్ వైట్ (37 బంతుల్లో 41; 4 ఫోర్లు; 1 సిక్స్), ఫించ్ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్) రాణించారు. బ్రాడ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇయాన్ మోర్గాన్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు; 2 సిక్స్) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. ఆసీస్ బౌలింగ్ ధాటికి కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. కౌల్టర్ నైల్, మాక్స్‌వెల్, ముయిర్‌హెడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు బెయిలీకి దక్కింది.