
సీఏతో క్రికెటర్ల కొత్త డీల్..
సిడ్నీ:గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ), ఆసీస్ క్రికెటర్ల మధ్య నెలకొన్న జీతాల వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ మేరకు గురువారం సీఏకు ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ కు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దానిలో భాగంగా క్రికెటర్లు ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలానికి సుమారు 396 మిలియన్ డాలర్లతో కొత్తగా ఒప్పంద చేసుకున్నారు. దాంతో ఇంతవరకూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భవితవ్యంపై నెలకొన్న సందిగ్థత తొలగిపోయింది. తమ మధ్య చోటు చేసుకున్న ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్ వివాదానికి తెరపడినట్లు సీఏ చీఫ్ సుదర్లాండ్ తో పాటు, ఆసీస్ క్రికెటర్ల సంఘం చీఫ్ అలిస్టెర్ నికొల్సన్ పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ఆటగాళ్లు ఐదేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. మరొకవైపు కొత్త కాంట్రాక్ట్ లో కీలక మార్పులు చేయడంతో అందుకు ఆటగాళ్లు అందుకు విముఖత వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఆటగాళ్లకు సీఏ మధ్య వివాదం నెలకొంది. అయితే ఎట్టకేలకు అందుకు ముగింపు పలకడంతో ఆసీస్ క్రికెటర్లు ఊపిరిపీల్చుకున్నారు.