ఆస్ట్రేలియన్ మీడియా కూడా అదుర్స్ అంది!
ఆస్ట్రేలియా జట్టును ఇంటికి పంపేసి.. టీమిండియాను టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లోకి తీసుకెళ్లిన విరాట్ కోహ్లీని భారత మీడియా ప్రశంసించిందంటే అది మామూలే. కానీ, స్లెడ్జింగే లక్ష్యంగా భావించే ఆస్ట్రేలియా, అక్కడి మీడియా కూడా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించింది! ఇది పూర్తిగా 'విరాట్ షో' అని స్టీవ్ స్మిత్ అన్నాడని, అది నూటికి నూరుశాతం నిజమని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికలో క్రిస్ బరాట్ రాశారు. ఒంటిచేత్తో భారత బ్యాటింగ్ మాస్ట్రో ఆస్ట్రేలియాను ఇంటికి పంపేశాడని అన్నారు. ఈ మ్యాచ్ గెలుచుకున్నది ఒకే ఒక్క వ్యక్తి అని డైలీ టెలిగ్రాఫ్‌లో బెన్ హార్న్ రాశారు. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా ఆశలు కుప్పకూలిపోగా, టీమిండియా సగర్వంగా సెమీస్‌లోకి వెళ్లిందన్నారు. ఆ సమయంలో ప్రపంచ క్రికెట్ మొత్తమ్మీద విరాట్ కోహ్లీ లాంటి టాలెంట్ ఇంకెక్కడా లేదనిపించిందని చెప్పారు.
అత్యంత కష్టమైన ఛేజింగును కూడా అత్యంత సులభంగా మార్చింది కేవలం కోహ్లీ ఇన్నింగ్సేనని ద ఆస్ట్రేలియన్ న్యూస్‌పేపర్‌లో గిడియాన్ హై అన్నారు. ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ పుణ్యమాని తాము ఇంటికెళ్లిపోవాల్సి రావడంతో అసంతృప్తిగా ఉందని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తరఫున జెఫ్ లెమన్ రాశారు. విరాట్ నుంచి అద్భుతమైన క్లాసీ ఇన్నింగ్స్ వచ్చిందని, విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలని స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ నుంచి క్లాస్ పెర్ఫార్మెన్స్ వచ్చిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కామెంట్ చేశాడు.