అటు ముర్రే... ఇటు కెర్బర్‌ | Australian Open 2017: Andy Murray suffers shock defeat by Mischa Zverev | Sakshi
Sakshi News home page

అటు ముర్రే... ఇటు కెర్బర్‌

Published Mon, Jan 23 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

అటు ముర్రే... ఇటు కెర్బర్‌

అటు ముర్రే... ఇటు కెర్బర్‌

ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్స్‌కు చుక్కెదురు l
 మిషా, కోకో వాండెవె సంచలన విజయాలు
 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌


మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆదివారం పెను సంచలనాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌)... మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 50వ ర్యాంకర్‌ మిషా జ్వెరెవ్‌ (జర్మనీ) 7–5, 5–7, 6–2, 6–4తో ఆండీ ముర్రేను బోల్తా కొట్టించగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 35వ ర్యాంక్‌ కోకో వాండెవె 6–2, 6–3తో కెర్బర్‌ను మట్టికరిపించింది. 2004లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్, రెండో సీడ్‌ క్రీడాకారులు ప్రిక్వార్టర్స్‌లోపే ఓడిపోవడం ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) రెండో రౌండ్‌లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే.

గతంలో ఐదుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని ఐదుసార్లూ రన్నరప్‌ట్రోఫీతోనే సరిపెట్టుకున్న ముర్రేకు ఈసారి కూడా ఈ టోర్నీ కలిసిరాలేదు. జొకోవిచ్‌ రెండో రౌండ్‌లోనే ఓడిపోవడంతో ముర్రేకు ఈసారి టైటిల్‌ మార్గం సుగమం అయిందని భావించినా... మిషా జ్వెరెవ్‌ రూపంలో అతనికి దురదృష్టం ఎదురైంది. ముర్రేతో 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో ఆడిన మిషా ఏకంగా 118 సార్లు నెట్‌ వద్దకు దూసుకొచ్చి 65 సార్లు పాయింట్లు సాధించడం విశేషం. కేవలం 26 అనవసర తప్పిదాలు చేసిన మిషా ఎనిమిదిసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు.

కెర్బర్‌తో 68 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన కోకో ఏదశలోనూ తన ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. రెండు సెట్‌లలో రెండేసిసార్లు కెర్బర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కోకో తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది.

సూపర్‌ ఫెడరర్‌...
మాజీ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) మరోసారి స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 17వ సీడ్‌ ఫెడరర్‌ 6–7 (4/7), 6–4, 6–1, 4–6, 6–3తో ఐదో సీడ్‌ కీ నిషికోరి (జపాన్‌)ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు. 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ 24 ఏస్‌లు సంధించి, ఏడుసార్లు నిషికోరి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 7–6 (7/2), 7–6 (7/4), 7–6 (7/4)తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)పై, 12వ సీడ్‌ సోంగా (ఫ్రాన్స్‌) 6–7 (4/7), 6–2, 6–4, 6–4తో ఇవాన్స్‌ (బ్రిటన్‌)పై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు.

ముగురుజా ముందంజ
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఏడో సీడ్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌), 13వ సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోగా... ఎనిమిదో సీడ్‌ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) ఓడిపోయింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ముగురుజా 6–2, 6–3తో సొరాని క్రిస్టియా (రొమేనియా)పై, వీనస్‌ 6–3, 7–5తో మోనా బార్తెల్‌ (జర్మనీ)పై, పావ్లీచెంకోవా (రష్యా) 6–3, 6–3తో కుజ్‌నెత్సోవాపై గెలిచారు.

సానియా–స్ట్రికోవా జంటకు షాక్‌
మహిళల డబుల్స్‌ విభాగం మూడో రౌండ్‌లో నాలుగో సీడ్‌ సానియా మీర్జా (భారత్‌)–బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట 3–6, 6–2, 2–6తో ఎరి హోజుమి–మియు కాటో (జపాన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) ద్వయం 6–4, 6–3తో డెస్టానీ ఐయివా– పోల్మన్స్‌ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement