సమరానికి సై | Australian Open: Rafael Nadal biggest threat to Novak Djokovic's crown | Sakshi
Sakshi News home page

సమరానికి సై

Published Mon, Jan 13 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

సమరానికి సై

సమరానికి సై

మెల్‌బోర్న్: ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నేటి (సోమవారం) నుంచి తెర లేవనుంది. 14 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఎప్పటిలాగే టైటిల్ ఫేవరెట్లుగా ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్ లను విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే తొమ్మిది నెలలపాటు టెన్నిస్‌కు దూరంగా ఉన్నా గతేడాది రాఫెల్ నాదల్ తన పునరాగమనాన్ని ఘనంగానే చాటుకున్నాడు.
 
 
 ఓ దశలో కెరీర్ ఉనికినే ప్రశ్నార్థకం చేసిన మోకాలి గాయం నుంచి కోలుకుని రెండు గ్రాండ్‌స్లామ్ (ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్) విజయాలతో పాటు ఆ ఏడాదిని ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడిగా ముగించాడు. ఈసారి టైటిల్ నెగ్గి ఓపెన్ శకం (1968 నుంచి)లో ప్రతీ గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)ను కనీసం రెండేసి సార్లు గెలిచిన ఏకైక ఆటగాడిగా నిలవాలని ఈ స్పెయిన్ బుల్ భావిస్తున్నాడు.
 
  అంతేకాకుండా ఇప్పటికే 13 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన తను రోజర్ ఫెడరర్ (17 టైటిళ్లు) రికార్డుకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఆసీస్ దిగ్గజం రాడ్ లేవర్ మాత్రమే ఇప్పటిదాకా నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ను రెండేసి సార్లు గెలుచుకున్నాడు. 2009లో మాత్రమే నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నాడు.
 
 మరోవైపు స్పెయిన్ బుల్ దూకుడు తన ప్రధాన ప్రత్యర్థి డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌ను వణికిస్తోంది. ఈ సెర్బియా ఆటగాడు వరుసగా నాలుగోసారి, ఓవరాల్‌గా ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకోవాలని భావిస్తున్నాడు. 2008, 11,12,13లలో తను ఈ టైటిల్స్ నెగ్గాడు. దీంతో ప్రస్తుతం అగస్సీ, ఫెడరర్‌లతో సమానంగా ఉండగా ఈసారి కూడా మెల్‌బోర్న్ పార్క్‌లో విజేతగా నిలిస్తే వారిద్దరినీ అధిగమించినవాడవుతాడు. ఓపెన్ శకానికి ముందు రాయ్ ఎమర్సన్ మాత్రమే ఆరుసార్లు విజేత గా నిలిచాడు.
 
 గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్, షాంఘై, పారి్‌స్ మాస్టర్స్ ఈవెంట్స్ టైటిల్స్ నెగ్గడమే కాకుండా 24 మ్యాచ్‌ల్లో అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నాడు. గతేడాది నాదల్‌తో  చైనా ఓపెన్, ఏటీపీ టూర్ ఫైనల్స్‌లో తలపడగా వరుస సెట్లలో జొకోవిచ్ గెలిచాడు. అదీగాకుండా హార్డ్‌కోర్ట్‌లో సాగే ఈ మెగా టోర్నీ జొకోవిచ్ ఆటతీరుకు అనుకూలంగా ఉండడం కలిసొచ్చే అంశం. వీరిద్దరికి పోటీగా బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రేను మూడో ఫేవరెట్‌గా పేర్కొనవచ్చు. 77 ఏళ్ల అనంతరం వింబుల్డన్ నెగ్గిన తొలి బ్రిటిషర్‌గా గతేడాది తను చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడు సార్లు ఫైనల్‌కు వచ్చినా నెగ్గలేకపోయాడు. గతేడాది కూడా రన్నరప్‌గానే నిలిచాడు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ లేకపోవడం దెబ్బతీసే అంశం. ఇక దిగ్గజ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న స్విస్ ఆటగాడు ఫెడరర్ 2013లో సాధించిందేమీ లేదు. కేవలం ఒక్క టైటిల్ మాత్రమే నెగ్గాడు. స్లామ్ ఈవెంట్స్‌లో ఫైనల్స్‌కు కూడా చేరలేక టాప్-5 ర్యాంకులో కూడా లేకుండాపోయాడు. నాదల్‌కు తొలి రౌండ్‌లో స్థానిక ఆటగాడు బెర్నార్డ్ టామిక్ ఎదురవుతుండగా క్వార్టర్స్‌లో డెల్ పొట్రోతో ఆడే అవకాశం ఉంది. గత అక్టోబర్‌లో షాంఘై మాస్టర్స్‌లో తన చేతిలోనే ఓడాడు.
 
 ఇక మహిళల విభాగంలో ప్రధాన పోటీ అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, గతేడాది విజేత అజరెంకా మధ్యనే సాగనుంది. అద్భుత ఫామ్‌లో ఉన్న సెరెనా 2010 అనంతరం మరోసారి టైటిల్ గెలవాలని భావిస్తోంది. ఇప్పటికి తను ఐదుసార్లు విజేతగా నిలిచింది.
 
 అయితే ‘బెలారస్ భామ’ అజరెంకా ఈసారీ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. అజరెంకా గెలిస్తే 1996లో మార్టినా హింగిస్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ సాధించిన మరో క్రీడాకారిణిగా నిలుస్తుంది. ఈ టోర్నీకి సన్నాహకంగా భావించే బ్రిస్బేన్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో అజరెంకాపై సెరెనా నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఉంది. వీరికి నా లీ నుంచి పోటీ ఎదురుకానుంది.
 
 
 నేటి తొలి రౌండ్ కీలక మ్యాచ్‌లు
 పురుషుల విభాగం
 జొకోవిచ్ (2) x లూకాస్ లోకో
 డేవిడ్ ఫెరర్ (3) xఅలెజాంద్రో  
 వావ్రింకా (8) x గొలెబేవ్
 బెర్డిచ్ (7) x నెడొవ్యెసోవ్
 మహిళల విభాగం
 సెరెనా (1) x అష్లేగ్ బార్టి
 నా లీ (4) x అనా కొంజు
 క్విటోవా (6) x కుమ్‌కుమ్
 సారా ఎరాని (7) x జూలియా జార్జెస్
 నోట్: బ్రాకెట్లలో ఉన్న అంకెలు సీడింగ్స్
 
 ఉదయం గం. 5.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement