అప్పుడు అరంగేట్రం.. ఇప్పుడు తొలి శతకం
రాంచీ: ఒక క్రికెటర్ గా అరంగేట్రం చేసిన దేశంపైనే తొలి శతకం చేస్తే ఎలా ఉంటుంది. ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మ్యాక్స్ వెల్ విషయంలో అదే జరిగింది. రెండో టెస్టులో మిచెల్ మార్ష్ అర్ధాంతరంగా గాయపడటంతో మూడో టెస్టు తుది జట్టులో స్థానం దక్కించుకున్న మ్యాక్స్ వెల్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో శతకంతో రాణించి ఆసీస్ యాజమాన్యం పెట్టుకున్న ఆశల్ని నిజం చేశాడు.
గతంలో టెస్టు అరంగేట్రం చేసిన జట్టుపైనే మ్యాక్స్ వెల్ తాజాగా తొలి శతకం సాధించడం విశేషం. 2013లో భారత్ పై హైదరాబాద్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్ లో మ్యాక్స్ వెల్ అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి అదే జట్టుపై తొలి శతకం సాధించాడు. అటు మ్యాక్స్ వెల్ టెస్టు అరంగేట్రం..ఇటు ఆ ఫార్మాట్ లో తొలి శతకం భారత్ లోనే రావడం ఇక్కడ మరో విశేషం. ఇది మ్యాక్స్ వెల్ కెరీర్ లో నాల్గో టెస్టు మ్యాచ్. దీనికి ముందు టెస్టుల్లో మ్యాక్స్ వెల్ అత్యధిక స్కోరు 37.
మూడో టెస్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ తో కలిసి 191 పరుగుల భాగస్వామ్యాన్ని మ్యాక్ప్ వెల్ జత చేశాడు. ఈ క్రమంలోనే 185 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అనంతంర జడేజా బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు.