సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంపై వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడానికి తమ బ్యాట్స్‌మెన్ కారణమని విమర్శించాడు. నిలకడైన ఆట తీరుతో జట్టును మంచి స్థితిలో నిలవడానికి బదులు, నిర్లక్ష్యపు షాట్లతో ఔట్ కావడాన్ని ప్రధానంగా తప్పుబట్టాడు. మరి ఇంత దారుణమైన షాట్ల ఆడితే ఈ తరహా వైఫల్యాలే చూడాల్సి వస్తుందంటూ సహచరులకు చురకలు అంటించాడు. రాబోవు మ్యాచ్‌ల్లోనైనా నిర్లక్ష్యపు షాట్లను వదిలి మంచి భాగస్వామ్యాలను నమోదు చేయాలని సూచించాడు.
‘స్కోరు బోర్డుపై పోరాడటానికి సరిపడా పరుగులు లేవు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూనే ఉన్నాం. స్కోరు బోర్డుపై సరైన భాగస్వామ్యమే లేదు. ఇందుకు కారణం తమ ఆటగాళ్లు నిర్లక్ష్యపు షాట్లే. ప్రధానంగా మధ్య ఓవర్లలో మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. ప్రతీ ఒక్క బ్యాట్స్‌మన్ మరింత బాధ్యతగా ఆడాలి. ఈ వరల్డ్‌కప్‌లో రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్ నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనబడింది’ అని హోల్డర్ మండిపడ్డాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ నిర్దేశించిన 213 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment