లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ కథ లీగ్ దశలోనే ముగిసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్లకు 315 పరుగులు చేయడంతో సెమీస్ రేసు నుంచి వైదొలగక తప్పలేదు. 316 పరుగుల భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ అంతే లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌కు నిర్దేశించింది. తద్వారా ఈ వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరాలన్న పాక్ ఆశలు తీరలేదు. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన పాక్ ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
ఈ మెగా టోర్నీలో బాబర్ అజామ్ చేసిన పరుగులు 474. ఫలితంగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జావెద్ మియాందాద్ రికార్డును తిరగరాశాడు. 27 ఏళ్ల క్రితం 1992 వరల్డ్‌కప్‌లో మియాందాద్ 437 పరుగులు చేశాడు. ఇది ఇప్పటివరకూ పాకిస్తాన్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు కాగా, దాన్ని ఈ వరల్డ్‌కప్‌లో బాబర్ అజామ్ బ్రేక్ చేశాడు. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో పాకిస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అజామ్(96) తృటిలో సెంచరీ కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment