
కిక్ కొడతానంటున్న మహిళా బాక్సర్ బేబి సింధు
బాక్సింగ్.. మగాళ్లే భయపడే ఆట.. బరిలోకి దిగి పంచ్‌లు విసరడం అంత సామాన్యం కాదు.. ఎంతో ఆత్మవిశ్వాసం అవసరం. ఇప్పుడా క్రీడలో తెనాలి అమ్మాయి తెగువ చూపుతోంది. అతి స్వల్ప కాలంలోనే రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచి, బంగారు పతకాన్ని సాధించింది. జాతీయ పోటీలకు అర్హత సాధించింది. ‘దెబ్బలు తగులుతాయి కదా’ అని ప్రశ్నిస్తే, ‘దెబ్బ కొడితేనే మనకూ పాయింట్లొస్తాయి.. అదే ఈ గేమ్‌లో కిక్’ అంటున్న బేబి సింధును ‘సాక్షి’ పలకరించింది.
తొలి కిక్‌తోనే బంగారు పతకం..
తన పేరు బేబి సింధు. పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శారద, ఆర్టీసీ హైర్డ్ ప్రైవేటు బస్ డ్రైవర్ బి.కృష్ణకిషోర్‌ల కుమార్తె. ఈనెల 13, 14, 15 తేదీల్లో విశాఖపట్టణంలో నిర్వహించిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ క్రీడల పోటీల్లో విమెన్స్ బాక్సింగ్‌లో అండర్–17, 63–66 కిలోల విభాగంలో పోటీ పడింది.రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా పాల్గొన్న పోటీలోనే తన పంచ్ అదిరింది. ప్రథమస్థానం సాధించి, బంగారు పతకాన్ని గెలుచుకుంది. హరియాణలో నవంబరు 2–10 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళల బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించింది. జాతీయ పోటీల్లోనూ సత్తా చాటి పతకం సాధించాలనే ఆశయంతో జోరుగా సాధన చేస్తోంది.
బాక్సింగ్ కోసం ఆర్ట్స్ గ్రూపు..
స్థానిక వివేక పబ్లిక్ స్కూలు నుంచి పదో తరగతిలో 8.7 జీపీఏతో ఉత్తీర్ణురాలైన సింధు ప్రస్తుతం గుంటూరు ఏసీ కాలేజిలో జూనియర్ ఇంటర్ చదువుతోంది. పదో తరగతి పరీక్షలైన వెంటనే గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బాక్సింగ్ సాధన ఆరంభించింది. ఆషామాషీ సాధన కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలనేది ఆశయం. ‘సైన్స్, మేథ్స్ గ్రూపులు తీసుకుంటే, చదువుకూ సమప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. చదువుకు ఎక్కువ సమయం ఇవ్వటం సాధ్యంకాదన్న అభిప్రాయంతో ఇంటర్‌లో హెచ్‌ఈసీ గ్రూపు తీసుకున్నా’నని చెప్పింది.
ప్రేరణ అన్నయ్య విశాల్..
డిగ్రీ చేస్తున్న అన్నయ్య విశాల్ తనకు స్ఫూర్తి. చదువుకుంటూ బాక్సింగ్ సాధన చేస్తుండే విశాల్‌ను, దెబ్బలు తగులుతాయనే భావనతో తల్లిదండ్రులు ప్రోత్సహించే వారు కాదు. అలాంటిది బేబి సింధును అనుమతించటం విశేషం. బాక్సింగ్ ప్రాధాన్యం, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందనీ నచ్చజెప్పటంతో తల్లిదండ్రులు ఇద్దరికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో అన్నాచెల్లెళ్లు నచ్చిన కోర్సులో చేరి, అటు సాధనకు, ఇటు చదువుకు సమయాన్ని సర్దుబాటు చేసుకున్నారు.
రోజూ 5 గంటలపైగా సాధన..
ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగింటికి లేచి సిద్ధమై ఐదు గంటల బస్సుకు గుంటూరు చేరుకుంటారు. అక్కడ బీఆర్ స్టేడియంలో శిక్షకుడు హనుమంతు నాయక్ దగ్గర 6 నుంచి 8.30 గంటల వరకు శిక్షణ. తరువాత కాలేజి, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ, సాధన పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. హెచ్‌ఈసీ గ్రూపు అయినందున పోటీలప్పుడు కాలేజి అనుమతితో, సాధనకు అధిక సమయం వెచ్చిస్తున్నట్లు సింధు చెప్పింది.
ఆత్మరక్షణకూ..
సెప్టెంబరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మహిళల బాక్సింగ్ పోటీలకు బీఆర్ స్టేడియంలోనే ఎంపిక నిర్వహించారు. అక్కడ ప్రదర్శనతో రాష్ట్ర పోటీలకు అర్హత లభించినట్లు బేబి సింధు చెప్పింది. ‘ఆత్మరక్షణకు బాక్సింగ్ ఎంతో ఉపయోగం.. ఇష్టంగా సాధన చేస్తే పతకాలు గెలిచే అవకాశం ఉంటుంది’ అనేది ఆమె అభిప్రాయం. అదే ఈ గేమ్‌లో కిక్’ అంటూ సమాధానమిచ్చింది. జాతీయ పోటీల్లో పతకం సాధించి, భారతదేశం తరఫున అంతర్జాతీయ టోర్నమెంటులో పాల్గొనాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment