భరత్ అరుణ్‌కు కోచ్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ’సి’ గ్రూప్‌లో ఉన్న హైదరాబాద్ జట్టు కొత్త ఏడాది కొత్త కెప్టెన్ నేతృత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. భారత జట్టు మాజీ ఆటగాడు, తమిళనాడు వెటరన్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ 2015-16 సీజన్‌లో హైదరాబాద్ టీమ్‌కు నాయకత్వం వహించనున్నాడు. 136 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉన్న 36 ఏళ్ల బద్రీనాథ్ ప్లేయర్ కం మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న హనుమ విహారి ఈసారి ఆంధ్రాకు తరలి వెళ్లిపోయాడు.
అయితేమరో రాష్ట్రానికి చెందిన ఆటగాడిని ఇలా మెంటర్ పేరుతో నాయకత్వ బాధ్యతలు అప్పగించడం హైదరాబాద్ జట్టుకు ఇదే మొదటిసారి. ఆంధ్రా జట్టు కూడా వరుసగా రెండు సీజన్లు సీనియర్లు అమోల్ మజుందార్, మొహమ్మద్ కైఫ్‌లను ఇలాగే తీసుకుంది. అనుభవం తక్కువగా ఉన్న తమ యువ క్రికెటర్లను నడిపించేందుకు సీనియర్ ఆటగాడి అవసరం ఉందంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ విజ్ఞప్తి చేయడంతో అతను హైదరాబాద్ తరఫున ఆడేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తమిళనాడు జట్టు తర్వాత గత రెండేళ్లు విదర్భ తరఫున ఆడిన బద్రీనాథ్... వాస్తవానికి తమిళనాడు బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పోటీ పడినా అవకాశం దక్కలేదు. భారత్ తరపున బద్రీనాథ్ 2 టెస్టులు, 7 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. 136 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 56.19 సగటుతో 9,778 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నారుు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను కరైకుడి కాలై జట్టు తరఫున ఆడుతున్నాడు.
అరుణ్‌కు అవకాశం...
జట్టు కోచ్ పదవి కోసం కూడా హెచ్‌సీఏ పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇంటర్వ్యూల అనంతరం భరత్ అరుణ్‌ను ఎంపిక చేసినట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అయూబ్ వెల్లడించారు. మీడియం పేస్ బౌలర్ అరుున అరుణ్ ఇటీవలి టి20 ప్రపంచ కప్ వరకు భారత సీనియర్ జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించారు. భారత్ తరఫున 2 టెస్టులు, 4 వన్డేలు ఆడిన ఆయన 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 110 వికెట్లు పడగొట్టారు.