నా అనుభవంపైనే ఆధారపడతాను
► స్పిన్నర్ హర్భజన్ సింగ్
న్యూఢిల్లీ: 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న తను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇదే అనుభవాన్ని ఉపయోగించి టీమిండియా మరోసారి టి20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు దోహదపడతానని, కొత్త ప్రయోగాల జోలికి పోవాల్సిన అవసరం లేదన్నాడు. ఆసీస్ పర్యటన కోసం తను పొట్టి ఫార్మాట్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ‘క్యారమ్ బాల్‌లాంటి వాటితో నేను ఇప్పుడు కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. నా బలమైన ఆఫ్ స్పిన్, దూస్రాలతోనే రెచ్చిపోతాను.
వీటి ఆధారంగానే గత 15 ఏళ్లలో సత్తా చాటి 700కు పైగా అంతర్జాతీయ వికెట్లు తీశాను. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మెరుగ్గానే ఆడాను. అయితే ఇప్పుడు నా దృష్టంతా టి20పైనే ఉంది. ఈ ఫార్మాట్‌తో పాటు వన్డే ప్రపంచకప్ కూడా నా ఖాతాలో ఉన్నాయి. మరోసారి నెగ్గి హ్యాట్రిక్ టైటిల్స్‌లో నా పాత్ర ఉంటే సంతోషిస్తా’ అని భజ్జీ తెలిపాడు. అలాగే తన సన్నిహితుడు ఆశిష్ నెహ్రా నాలుగున్నరేళ్ల అనంతరం జట్టులోకి రావడం ఆనందంగా ఉందని అన్నాడు. 2003, 11 ప్రపంచకప్‌ల్లో అతడిది కీలక పాత్ర అని చెప్పాడు. పాక్‌తో మొహాలీలో జరిగిన ప్రపంచకప్ సెమీస్‌లో డెత్ ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా జట్టులో చోటు కోల్పోయాడన్నాడు. ఎవరికైనా ప్రదర్శనే ముఖ్యమని, వయస్సు కాదని 35 ఏళ్ల హర్భజన్ స్పష్టం చేశాడు.