దుబాయ్: సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి శిక్షను అనుభవించారు. తమ పేరు, పరపతి అంతా చెడగొట్టుకున్నారు. క్రికెట్‌లో బాల్ టాంపరింగ్ కొత్త కాదు. వారికంటే ముందు కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే ఇకపై టాంపరింగ్ చేసినా కూడా ఎలాంటి శిక్షా ఉండకపోవచ్చు. ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయడాన్ని నేరంగా పరిగణిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ నిబంధనలు సడలించే అవకాశం కనిపిస్తోంది. బాల్ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉంది. అంపైర్ల పర్యవేక్షణలో బంతిని పాలిష్ చేసేందుకు అనుమతిస్తారు.
ఇదీ కారణం...
పరిమిత ఓవర్ల క్రికెట్లో తెల్ల బంతితో సమస్య కాకున్నా... టెస్టుల్లో ఎర్ర బంతితో పేసర్లు ప్రభావం చూపించాలంటే దానిని పదే పదే పాలిష్ చేయడం అవసరం. అలా చేస్తేనే ఇరు వైపులా స్వింగ్‌ను రాబట్టేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు నిబంధనలకు లోబడి నోటి ఉమ్ము (సలైవా)ను బౌలర్లు వాడుతున్నారు. అయితే కరోనా దెబ్బకు బంతిపై ఉమ్మి రుద్దాలంటేనే బౌలర్లు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. అందులోనూ ఒకే బంతిని మైదానంలో అందరూ తీసుకోవడం అంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే. ఈ నేపథ్యంలో బంతి మెరుపు కోసం ఉమ్మిని వాడకుండా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ఐసీసీ మెడికల్ కమిటీ సూచించింది. దాంతో బయటి వస్తువుల ద్వారా కూడా టాంపరింగ్ చేసే అవకాశం కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. వచ్చే మేలో జరిగే టెక్నికల్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఏం వాడొచ్చంటే...
టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్‌మెన్ చితక్కొడతారు. తమ కెరీర్ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్ పేసర్ కమిన్స్ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్ ఉదంతంలో స్యాండ్ పేపర్ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్‌లీన్, ప్యాంట్ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్‌కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్‌జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. ఈ రకంగా చూస్తే బంతి మెరుపు కోసం లెదర్ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. చివరకు ఐసీసీ దేన్ని ఓకే చేస్తుందనేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment