మలింగ హ్యాట్రిక్ సాధించినా...
రెండో టి20లో బంగ్లా విజయం
కొలంబో: శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ‘హ్యా్టట్రిక్’ సాధించినా బంగ్లా చేతిలో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గురువారం ఇక్కడ జరిగిన రెండో టి20లో బంగ్లాదేశ్ 45 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. మొదట బంగ్లా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ (38), ఇమ్రుల్ కైస్ (36), సౌమ్య సర్కార్ (34) ధాటిగా ఆడారు. ముష్ఫికర్, మొర్తజా, మిరాజ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసిన మలింగ టి20ల్లో తన తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
మలింగ గతంలో వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లంక 18 ఓవర్లలో 131 పరుగుల వద్ద ఆలౌటైంది. కపుగెడెర (35 బంతుల్లో 50; 5ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ముస్తఫిజుర్ 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. తాజా ఫలితంతో రెండు టి20ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌తో బంగ్లా కెప్టెన్ మొర్తజా టి20 క్రికెట్‌నుంచి రిటైర్ అయ్యాడు.