బెంగళూరు: వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ చేరనుంది. గతేడాది సుమీత్ నాగల్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... ఈ సంవత్సరం భారత డేవిస్ కప్ జట్టు సభ్యులు సాకేత్ మైనేని, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ టైటిల్ కోసం నేడు అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని 4–6, 6–4, 6–4తో అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... ప్రజ్నేశ్ 6–4, 6–1తో బ్రైడెన్ ష్నుర్ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు.
నెదోవ్‌యెసోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్‌లో సాకేత్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు చేజార్చుకున్నాడు. అయితే పదో గేమ్‌లో పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో పురవ్ రాజా (భారత్)–ఆంటోనియో సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పురవ్ రాజా–సాన్సిచ్ ద్వయం 6–7 (3/7), 3–6తో మాక్స్ పర్సెల్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment