టైటిల్‌ 'బెంగ' తీరేనా? | Bangalore Royal Challengers dream to win the ipl title | Sakshi
Sakshi News home page

టైటిల్‌ 'బెంగ' తీరేనా?

Published Wed, Mar 20 2019 12:04 AM | Last Updated on Wed, Mar 20 2019 3:52 PM

Bangalore Royal Challengers dream to win the ipl title - Sakshi

ప్రపంచ క్రికెట్‌లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి. భారత కెప్టెన్‌గా కూడా చిరస్మరణీయ విజయాలు అందుకుంటున్నాడు. అదేంటో గానీ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం అతనికి ఏదీ కలిసి రావడం లేదు. అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న సమయంలో కూడా టీమ్‌ టైటిల్‌ కోరిక తీరలేదు. 2011 నుంచి వరుసగా ఎనిమిది సీజన్ల పాటు నాయకుడిగా వ్యవహరించినా, విరాట్‌ తన టీమ్‌ను విజేతగా నిలపలేకపోయాడు. ప్రతీసారి భారీ అంచనాలతో బరిలోకి దిగడం, కీలక సమయంలో చతికిల పడటం అలవాటుగా మార్చుకున్న ఆర్‌సీబీ ఈ సారైనా తమ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేక ఎప్పటిలాగే కొన్ని గుర్తుంచుకునే మెరుపు ప్రదర్శనలతో సరి పెట్టి ఆటను ముగిస్తుందా చూడాలి.   

బలాలు: 2016లో విరాట్‌ కోహ్లి ఏకంగా 973 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును ఫైనల్‌ చేర్చాడు. గత రెండు సీజన్లు కోహ్లి ఆ స్థాయిలో చెలరేగకపోవడంతో జట్టుపై ప్రభావం పడి ఎనిమిదో, ఆరో స్థానాలకే టీమ్‌ పరిమితమైంది. ఇప్పుడు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లిపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. అతనికి తోడుగా డివిలియర్స్‌ ఎలాగూ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి దూరమైన తర్వాత వరుసగా టి20లీగ్‌లపైనే దృష్టి పెట్టిన డివిలియర్స్‌... బంగ్లా లీగ్, పీఎస్‌ఎల్‌లలో కలిపి గత పది మ్యాచ్‌లలో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీతో పాటు మరో ఐదు ఇన్నింగ్స్‌లలో దూకుడుగా ఆడుతూ 30కి పైగా పరుగులు చేయడం అతని ఫామ్‌ను సూచిస్తోంది. విదేశీ ఆల్‌రౌండర్లు మొయిన్‌ అలీ, గ్రాండ్‌హోమ్‌ ధాటిగా ఆడగల సమర్థులు. ఈసారి కొత్తగా జట్టులోకి వచ్చిన విండీస్‌ ఆటగాడు హెట్‌మైర్‌పై కూడా జట్టు ఆధారపడుతోంది. భారత్‌తో ఇటీవల ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణించిన ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ జట్టులో ఉండటం బెంగళూరు బలాన్ని పెంచుతోంది. బౌలింగ్‌లో గత సంవత్సరం ఉమేశ్‌ యాదవ్‌ చెలరేగి 20 వికెట్లు పడగొట్టాడు. లెగ్‌స్పిన్నర్‌ చహల్‌ కూడా కేవలం 7.26 ఎకానమీతో 12 వికెట్లు తీయగా...ఈ ఏడాది కాలంలో భారత బౌలర్‌గా అతను ఎంతో ఎదిగాడు. మరో పేసర్‌గా ఆడే అవకాశం ఉన్న కూల్టర్‌ నీల్‌కు భారత్‌లో మంచి అనుభవం ఉంది. హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ కూడా వరుసగా రెండో సంవత్సరం ఇదే జట్టు తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కొత్తగా వచ్చిన లెగ్‌స్పిన్నర్‌ ప్రయాస్‌ రే బర్మన్‌ కూడా ప్రభావం చూపించగలడని ఆర్‌సీబీ నమ్ముతోంది.  

బలహీనతలు: ఒకప్పుడు గేల్‌ జట్టులో ఉండగా టాప్‌–3 విధ్వంసం సృష్టించినా ఆర్‌సీబీకి టైటిల్‌ దక్కలేదు. ఇప్పుడు కూడా కోహ్లి, డివిలియర్స్‌లను మినహాయిస్తే కచ్చితంగా చెలరేగిపోగలడని నమ్మే పరిస్థితి లేదు. వీరిద్దరు మినహా జట్టులో చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ లేరు. పార్థివ్‌ పటేల్, గుర్‌కీరత్‌ మాన్, మిలింద్‌ కుమార్, క్లాసెన్‌ల బ్యాటింగ్‌నుంచి ఏం ఆశించగలం! శివమ్‌ దూబే మొదటి సారి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. గతంలో చాలా సార్లు ఇబ్బంది పెట్టిన మిడిలార్డర్‌ బలహీనతే జట్టుపై మళ్లీ ప్రభావం చూపే అవకాశం ఉంది. పైగా జట్టులో ఉన్న విదేశీ ఆల్‌రౌండర్లలో ఒక్కరూ కూడా ఐదో బౌలర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వర్తించగల సమర్థులు కాదు. స్టొయినిస్, కూల్టర్‌నీల్, అలీ మొత్తం టోర్నీలో అందుబాటులో ఉండటం లేదు. విరాట్‌ చెప్పినట్లు ప్రణాళికలు సమర్థంగా అమలు చేస్తే ఈ సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు జట్టుకు ఉన్నాయి. కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ ఈ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. 

జట్టు వివరాలు:  కోహ్లి (కెప్టెన్‌), అ„Š  దీప్, చహల్, శివమ్‌ దూబే, గుర్‌కీరత్, హిమ్మత్, ఖెజ్రోలియా, మిలింద్, సిరాజ్, పవన్‌ నేగి, దేవ్‌దత్, పార్థివ్, రే బర్మన్, నవదీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్, ఉమేశ్‌ యాదవ్‌ (భారత ఆటగాళ్లు), అలీ, గ్రాండ్‌హోమ్, డివిలియర్స్, హెట్‌ మైర్, క్లాసెన్, సౌతీ, స్టొయినిస్‌ (విదేశీ ఆటగాళ్లు). 


కొసమెరుపు... 
తాజా సీజన్‌లో ప్రొ కబడ్డీ లీగ్, ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్, ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్స్‌ను కర్ణాటక/బెంగళూరు జట్లే గెలుచుకున్నాయి. ఇదే జోరులో ఐపీఎల్‌లో కూడా అన్నీ అనుకూలిస్తాయని వీరాభిమానులు భావిస్తున్నారు. అందుకే తుది ఫలితం సంగతేమో కానీ ప్రస్తుతాని కైతే తమ జట్టే గెలుస్తుందంటూ కన్నడలో ‘ఈ సాలా కప్‌ కప్‌ నమ్‌దే’ అంటూ పాడుకుంటున్నారు!   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement