
అర్హత మ్యాచ్ లో బంగ్లాదేశ్ బోణి
మిర్పూర్: ట్వంటీ-20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ -ఏ లో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఆఫ్ఘానిస్తాన్ తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘాన్లకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు మహ్మద్ షాహజాద్(0) పరుగులేమీ చేయకుండా, నజీబ్ తరాకై(7) పరుగులకే పెవిలియన్ దారిపట్టడంతో ఆఫ్ఘాన్ కు కష్టాలు ఆరంభమైయ్యాయి. అనంతరం గుల్బదీన్ నాయబ్ (21) పరుగులు, కరీం సాథిక్(10), షఫికుల్హా(16)పరుగులు మాత్రమే చేయడంతో 17.1 ఓవర్లలో ఆఫ్ఘాన్ లు కేవలం 72 పరుగులకే చాపచుట్టేశారు.
ఆఫ్ఘాన్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమై భారీ స్కోరు చేయడంలో విఫలమైయ్యారు. అదనపు పరుగుల రూపంలో వచ్చిన 12 పరుగులు ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ లో మూడో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. బంగ్లా బౌలర్లలో షకిబుల్ హసన్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, అబ్దుల్ రజాక్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా ఆటగాళ్లు ఒక్క వికెట్టు మాత్రమే కోల్పోయి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. తమీమ్ ఇక్భాల్ (21), అనాముల్ హకీ(44) పరుగులతో రాణించి బంగ్లాకు విజయాన్ని సాధించిపెట్టారు.