ప్రేయసి ఫోటోలు పోస్ట్ చేసి అరెస్టైన క్రికెటర్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ అర్ఫాత్ సన్నీ చిక్కుల్లో పడ్డాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అర్ఫాత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం గర్ల్ ఫ్రెండ్ కు చెందిన అభ్యంతకర ఫోటోలను అర్ఫాత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై అర్ఫాత్ గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో అతనిపై తాజాగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఢాకాలోని ఆర్ఫాత్ ఇంటిలో సోదాలు నిర్వహించిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి జమలుద్దీన్ మిర్ తెలిపారు. గర్ల్ ఫ్రెండ్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన అర్ఫాత్.. వారు సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో దిగిన కొన్ని అభ్యంతకర ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై అర్ఫాత్ గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు మిర్ తెలిపారు.
ప్రస్తుతం అతని కేసును కోర్టుకు అప్పగించామన్నారు. అతనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టడానికి ఐదు రోజులు కస్టడీ కోరనున్నట్లు సదరు పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఒకవేళ అర్పాత్ సన్నీ తప్పు చేసినట్లు తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ చట్ట ప్రకారం వివాదాస్పద ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారికి కఠిన శిక్షను అమలు చేస్తున్నారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. 'అది అతని వ్యక్తిగత వ్యవహారం. ఈ వ్యవహారంపై ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నాం'అని మాత్రమే బంగ్లా క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నజముద్దీన్ చౌదరి తెలిపారు.