Arafat Sunny
-
కట్నం కోసం భార్యను వేధిస్తున్న క్రికెటర్
ఢాకా:బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ కథ మళ్లీ మొదటికొచ్చింది. వరకట్న వేధింపుల కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలై ఇంటివద్దనే ఉంటున్న అరాఫత్ భార్యను మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్య నస్రీన్ సుల్తానాను పదే పదే వేధించ సాగాడు. అందుకు తల్లి కూడా వంతపాడటంతో వేధింపులను తట్టుకోలేక నస్రీన్ సుల్తానా పోలీసుల్ని ఆశ్రయించింది. 2014 డిసెంబర్ 4న నస్రీన్ సుల్తానా తో సన్నీకి వివాహమైంది. అప్పుడు అతను 5.1 లక్షలు కట్నంగా అందుకున్నాడు. పెళ్లైన నాల్గో రోజునే ఆ కట్నాన్ని సన్నీకి అందజేశారు. వారి వివాహబంధం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. కాగా, 2015లో జూన్ 29 వ తేదీన మరో రూ. 20లక్షలు కట్నం తేవాలంటూ సన్నీ, అతని తల్లి వేధించసాగారు. ఇందుకు ఆమె ఒప్పకోలేదు. అదే సమయంలో ఈ ఏడాది జనవరి 5వ తేదీన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దాంతో 22వ తేదీన సన్నీ అరెస్టయ్యాడు. ఆ వివాదాన్ని రాజీ చేసుకున్నామని సన్నీ భార్య కోర్టుకు తెలపడంతో అతడు విడుదలయ్యాడు. తాజాగా అతడు మరొకసారి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మళ్లీ వివాదం మొదటికి రావడంతో అరాఫత్ కు కఠిన శిక్ష పడే అవకాశాలు కనబడుతున్నాయి. -
మరో వివాదంలో చిక్కుకున్న క్రికెటర్!
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీపై మరో కేసు నమోదయింది. గర్ల్ ఫ్రెండ్ అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అరెస్టయి బెయిల్ పై బయటకు వచ్చిన ఈ క్రికెటర్.. తాజాగా మరో కేసులో చిక్కుకున్నాడు. క్రికెటర్ అరాఫత్ తన భర్త అని, ఆయనతో పాటు ఆమె తల్లి తనను కట్నం కోసం తరచూ వేధిస్తున్నాడని అతడి గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ సుల్తానా ఫిర్యాదు చేసింది. మహిళలు మరియు పిల్లలు అణచివేత నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఢాకా స్థానిక కోర్టులో క్రికెటర్ ను, అతడి తల్లిని ప్రవేశపెట్టారు. అరాఫత్ ను విచారించేందుకు ఏడు రోజుల కస్డడీకి అనుమతించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. కేసు విచారించిన ఢాకా స్థానిక కోర్టు బంగ్లా క్రికెటర్ కు జైలుశిక్ష విధించారు. షాహదత్ హుస్సేన్, రుబెల్ హుస్సేన్ ల తర్వాత అరెస్టయిన మూడో క్రికెటర్ అరాఫత సన్నీ. మొదట గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన నస్రీన్, తాను అరాఫత్ భార్యనని విచారణలో వెల్లడించింది. గర్ల్ ఫ్రెండ్(నస్రీన్) ఫొటోల కేసు వ్యవహారంలో అతడు దోషీగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అరాఫత్ బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు 16 వన్డేలు, 10 ట్వంటీ20 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. క్రికెటర్ల వ్యక్తిగత విషయాలపై తాము స్పందించబోమని బంగ్లా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. -
ప్రేయసి ఫోటోలు పోస్ట్ చేసి అరెస్టైన క్రికెటర్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ అర్ఫాత్ సన్నీ చిక్కుల్లో పడ్డాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అర్ఫాత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం గర్ల్ ఫ్రెండ్ కు చెందిన అభ్యంతకర ఫోటోలను అర్ఫాత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై అర్ఫాత్ గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో అతనిపై తాజాగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఢాకాలోని ఆర్ఫాత్ ఇంటిలో సోదాలు నిర్వహించిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి జమలుద్దీన్ మిర్ తెలిపారు. గర్ల్ ఫ్రెండ్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన అర్ఫాత్.. వారు సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో దిగిన కొన్ని అభ్యంతకర ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై అర్ఫాత్ గర్ల్ ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు మిర్ తెలిపారు. ప్రస్తుతం అతని కేసును కోర్టుకు అప్పగించామన్నారు. అతనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టడానికి ఐదు రోజులు కస్టడీ కోరనున్నట్లు సదరు పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఒకవేళ అర్పాత్ సన్నీ తప్పు చేసినట్లు తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ చట్ట ప్రకారం వివాదాస్పద ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారికి కఠిన శిక్షను అమలు చేస్తున్నారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. 'అది అతని వ్యక్తిగత వ్యవహారం. ఈ వ్యవహారంపై ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నాం'అని మాత్రమే బంగ్లా క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నజముద్దీన్ చౌదరి తెలిపారు. -
పరుగులివ్వకుండా 3 వికెట్లు డౌన్!
మిర్పూర్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) టీ20 లీగ్ లో బంగ్లా బౌలర్ ఆరాఫత్ సన్నీ సంచలనం నమోదు చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టాడు. రంగ్ పూర్ రైడర్స్, ఖల్నా టిటియన్స్ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో అతడీ ఘనత సాధించాడు. రైడర్స్ చేతిలో టిటియన్స్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. రైడర్స్ ఆటగాళ్లు పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది, ఆరాఫత్ సన్నీ ధాటికి టిటియన్స్ హడలెత్తింది. బీపీఎల్ లోనే అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టిటియన్స్ టీమ్ 10.4 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. షువగత(12) ఒక్కడే రెండంకెల స్కోరు చేశారు. నలుగురు డకౌటయ్యారు. ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఆఫ్రిది 12 పరుగులిచ్చి 4 వికెట్లు నేలకూల్చాడు. 45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రైడర్స్ ఒక వికెట్ నష్టపోయి 8 ఓవర్లలో చేరుకుంది. ఆఫ్రిదికి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. -
టస్కిన్, సన్నీలపై వేటు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా పేసర్ టస్కిన్ అహ్మద్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అరాఫత్ సన్నీలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ విధించింది. స్వతంత్ర విచారణ పరీక్షలో వీరిద్దరి బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలిందని ఐసీసీ ప్రకటించింది. -
గ్రేట్ క్యాచ్.. హఫీజ్ అవుట్..!
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఫీల్డర్ సౌమ్య సర్కార్ అద్భుతం చేశాడు. గ్రేట్ క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్న మహ్మద్ హఫీజ్ ను పెవిలియన్ పంపాడు. అరాఫత్ సన్నీ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద సర్కారు అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటే సమయంలో చేతిలోని బంతిని మైదానంలోకి విసిరేసి బౌండరీ దాటాడు. మళ్లీ బౌండరీ లోపలికి వచ్చి బంతిని ఒడిసి పట్టాడు. మైదానంలోని ప్రేక్షకులతో పాటు టీవీల్లో వీక్షిస్తున్న వారందరూ సర్కార్ ఫీట్ ను ఆసక్తిగా తిలకించారు. సర్కార్ పట్టిన క్యాచ్ తో హఫీజ్ ను అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి.