భళా...బంగ్లాదేశ్!
హైదరాబాద్:భారత్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ పరాజయం చెందినప్పటికీ తన ఆట తీరుతో మాత్రం ఆకట్టుకుంది. ఈ టెస్టు మ్యాచ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ చూడచక్కని ఆటతో అబ్బుర పరిచింది. ఇంకా టెస్టుల్లో ఓనమాలు దశలోనే ఉన్న బంగ్లాదేశ్.. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాకు అంత ఈజీగా లొంగలేదు. అసలు మూడు రోజుల్లోనే మూటాముళ్లూ సర్దుకుంటుందని భావించిన వారికి తమ ఆట ద్వారానే సమాధానం చెప్పింది బంగ్లాదేశ్. ఆఖరి రోజు వరకూ పోరాటాన్ని సాగించి శభాష్ అనిపించింది.
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఒక సెంచరీ తో పాటు మూడు హాఫ్ సెంచరీలు సాధించిందంటే వారి ప్రదర్శనను తక్కువగా చేసి చూడటం పొరపాటే అవుతుంది. తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ శతకంతో ఆకట్టుకుంటే అతనికి జతగా సీనియర్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్, మెహిది హసన్ మిరాజ్ లు హాఫ్ సెంచరీలతో మెరిశారు.ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ లో కూడా బంగ్లాదేశ్ పోరాడింది. ఇక్కడ మొహ్ముదుల్లా హాఫ్ సెంచరీ రాణిస్తే, మరో ఆరుగురు ఆటగాళ్లు ఇరవైకి పైగా పరుగులు సాధించి ఫర్వాలేదనిపించారు. దాంతో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ లో 100.3 ఓవర్లలో 250 పరుగులను సాధించింది. తద్వారా ఒక అరుదైన ఘనతను బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. గత 17 ఏళ్ల కాలంలో నాల్గో ఇన్నింగ్స్ లో భారత గడ్డపై అత్యధిక స్కోరు నమోదు చేసిన రెండో విదేశీ జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.
2000వ సంవత్సరం నుంచి చూస్తే మ్యాచ్ నాల్గో ఇన్నింగ్స్ లో భారత్ పై స్వదేశంలో అత్యధిక స్కోరు నమోదు చేసిన రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2003, అక్టోబర్ 8వ తేదీన టీమిండియాతో మ్యాచ్ లో న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. అదే భారత్ లో ఒక విదేశీ జట్టు నమోదు చేసిన నాల్గో ఇన్నింగ్స్ అత్యధిక స్కోరు. ఆ తరువాత స్థానంలో బంగ్లాదేశ్ నిలిచింది. తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్ నాల్గో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 250 పరుగుల మార్కును చేరి సెకండ్ ప్లేస్ ను ఆక్రమించింది. భారత్ తో మరిన్ని టెస్టు మ్యాచ్ లు ఆడి తమ క్రికెట్ కు మెరుగులు దిద్దుకోవాలనుకుంటున్న బంగ్లాదేశ్ ఆశయానికి వారి తాజా ప్రదర్శన ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాలి మరి.