సఫారీలపై బంగ్లా పంజా
♦ మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు
♦ సిరీస్ 2-1తో బంగ్లాదేశ్ సొంతం
చిట్టగాంగ్ : పాక్‌పై సిరీస్ గెలిస్తే ప్రత్యర్థి బలహీనమన్నారు... భారత్‌ను ఓడిస్తే ఎప్పుడో ఒకసారి కలిసొచ్చిన అదృష్టం అన్నారు... కానీ ఇప్పుడు పటిష్ట దక్షిణాఫ్రికాపై కూడా బంగ్లా పులులు పంజా విసిరారు. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో బంగ్లా ఏకంగా 9 వికెట్ల తేడాతో, మరో 83 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. సొంతగడ్డపై బంగ్లాకు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం కావడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్లకు 168 పరుగులు చేసింది. డుమిని (70 బంతుల్లో 51; 3 ఫోర్లు), మిల్లర్ (51 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా, ముస్తఫిజుర్, రూబెల్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 26.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 170 పరుగులు చేసి (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయాన్నందుకుంది. సౌమ్య సర్కార్ (75 బంతుల్లో 90; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడగా, తమీమ్ ఇక్బాల్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 154 పరుగులు జోడించడం విశేషం.