కోల్ కతా: అండర్-19 ముక్కోణపు సిరీస్ లో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఆఫ్ఘానిస్థాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్ జట్టులో ఓపెనర్లు హజ్రాతుల్లా(34), ఇస్మానుల్లా(14) మాత్రమే రెండంకెల మార్కును చేరుకున్నారు. అనంతరం తొమ్మిదిమంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆఫ్ఘాన్ 30.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో సాలేహ్ అహ్మద్ షావోన్ ఆరు వికెట్లు తీసి ఆఫ్ఘాన్ పతనాన్ని శాసించాడు.
కాగా, స్వల్ప లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ పోరాడి గెలిచింది. సైఫ్ హసన్(32), హుస్సేన్ శాంతో(19), జాకీర్ హసన్(13)లు ఫర్వాలేదనిపించడంతో బంగ్లా గట్టెక్కింది. ఈ మ్యాచ్ లో విజయంతో బంగ్లాకు ఐదు పాయింట్లు లభించాయి.