
తొలి మ్యాచ్ లో భారత్ ఘనవిజయం
కోల్ కతా: అండర్-19 ట్రై సిరీస్ లో భారత్ బోణి కొట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంది. భారత ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(34), అమూల్ ప్రీత్ సింగ్(28), జిషన్ అన్సారీ(34), అవిష్ ఖాన్(25)లు ఓ మోస్తరుగా రాణించారు. దీంతో భారత్ 45.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది.
అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సైఫ్ హసన్(0), పినాక్ ఘోష్(1) పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ వరుస వికెట్లను చేజార్చుకుంది. 26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఇక తేరుకోలేదు. బంగ్లా ఆటగాళ్లలో షఫిల్ హయత్(26), సయిద్ సర్కార్(13)లు రెండంకెల స్కోరును దాటగా, మిగతా వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 22 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో అవిష్ ఖాన్ బంగ్లా పతనాన్ని శాసించాడు. అవినాష్ ఆరు ఓవర్లు బౌలింగ్ వేసి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉండటం విశేషం. అతనికి జతగా కేకే సేథ్, జిషన్ అన్సారీలకు తలో రెండు వికెట్లు లభించాయి.