ఢాకా: వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్ నిర్వహణ సందేహంలో పడింది. రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో ఆటగాళ్ల భద్రతపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ వచ్చే నెలలో అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నాయి. గత అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా 74 మంది ప్రాణాలు కోల్పోయారు.
‘ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే ఎలాంటి పెద్ద టోర్నీ జరపాలన్నా, పాల్గొనే జట్ల భద్రత సందేహంగా మారుతుంది. డిసెంబర్, జనవరిలోగా ఈ ఆందోళనలు తగ్గుముఖం పట్టాలి. టి20 టోర్నీ వేదికలైన ఢాకా, చిట్టగాంగ్, సిల్హెట్‌తోపాటు ప్రతీ నగరానికి ఈ హింస పాకింది’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. ఐసీసీ తనిఖీ బృందం గత వారం ఇక్కడ పర్యటించి భద్రత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని తెలిపింది.
బంగ్లాలో టి20 ప్రపంచకప్ అనుమానమే!
Published Wed, Dec 11 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement