8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
ధర్మశాల: క్వాలిఫయంగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో నెదర్లాండ్పై విజయం సాధించింది. నిర్ణీత 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.
హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. తొలి నుంచి కూడా వికెట్లు తీయడంలో బంగ్లా బౌలర్లు సఫలం కావడంతో విజయం సులభమైంది. ఓ దశలో నెదర్లాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. కానీ, బ్యాట్స్మెన్స్ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. స్టెఫాన్ మైబర్గ్ 29, కెప్టెన్ పీటర్ బోరెన్ 29, బెన్ కూపర్ 20, టామ్ కూపర్ 15 పరుగులు చేసినా చివర్లో బౌలర్లు చేతులేత్తేశారు. బంగ్లా బౌలర్లు అమిన్ హుస్సేన్ రెండు, షకిబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, నాసిర్ హుస్సన్, మొర్తజా తలో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసినా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగినా... మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. వరుస వికెట్లు కోల్పోతున్న ఇక్బాల్ ధీటుగా ఆడుతూ టీమ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా తమీమ్ ఇక్బాల్ ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7 గంటలకు ఐర్లాండ్, ఒమన్ ల మధ్య జరుగును.