అఫ్ఘానిస్తాన్ శుభారంభం
* స్కాట్లాండ్‌తో మ్యాచ్
* టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్
నాగ్‌పూర్: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా గ్రూప్ ‘బి’లో మంగళవారం జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘాన్ 14 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మొహమ్మద్ షెహజాద్ (39 బంతుల్లో 61; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), అస్గర్ (50 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగి రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. మున్సే (29 బంతుల్లో 41; 9 ఫోర్లు), కొయెట్జెర్ (27 బంతుల్లో 40; 4 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడి తొలి వికెట్‌కు 84 పరుగుల శుభారంభాన్నిచ్చినా ఆ తర్వాత జట్టు త్వరగా వికెట్లు కోల్పోయింది. అయితే మధ్య ఓవర్లలో మ్యాట్ మ్యాకన్ (31 బంతుల్లో 36; 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి శిబిరంలో ఆందోళన రేపాడు. అయితే నబీ అతడిని అవుట్ చేయడంతో స్కాట్లాండ్ కోలుకోలేకపోయింది.