twenty 20 world cup 2016
-
జింబాబ్వేకు మరో విజయం
నాగ్‌పూర్:వరల్డ్ టీ 20లో జింబాబ్వే మరో విజయాన్ని సాధించింది. గ్రూప్-బిలో స్కాట్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినా సీన్ విలియమ్స్ (53) ఆదుకున్నాడు. ఆ తరువాత ముతాంబమి(19), వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. అనంతరం 148 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 42 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోయింది. అయితే ఆ తరువాత బెర్రింగ్టన్(36), మోమ్సేన్(31), డేవీ(24) దూకుడును ప్రదర్శించి జింబాబ్వే జట్టులో ఆందోళన రేకెత్తించారు. కాగా, స్వల్ప వ్యవధిలో స్కాట్లాండ్ వికెట్లను కోల్పోవడంతో 19.4 ఓవర్లలో 136 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జింబాబ్వే బౌలర్లలో వెల్టింగ్టన్ మసకద్జ నాలుగు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్ లో హాంకాంగ్ ను జింబాబ్వే ఓడించిన సంగతి తెలిసిందే. -
స్కాట్లాండ్ విజయలక్ష్యం 148
నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, సీన్ విలియమ్స్ (53), ముతాంబమి(19)లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంతో తేరుకుంది. చివర్లో వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడటంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో ఇవాన్స్, వాట్, షరిఫ్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్-10 దశకు అర్హత సాధించేందుకు జరుగుతున్న తొలి రౌండ్ పోరులో ఇప్పటికే జింబాబ్వే ఒక మ్యాచ్ గెలవగా, స్కాట్లాండ్ ఆడిన మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇరు జట్లను బలబలాలను పరిశీలిస్తే జింబాబ్వేనే కాస్త మెరుగ్గా ఉంది. ఇక స్కాట్లాండ్ జట్టు సమష్టి ప్రదర్శనే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. -
8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
ధర్మశాల: క్వాలిఫయంగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో నెదర్లాండ్‌పై విజయం సాధించింది. నిర్ణీత 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. తొలి నుంచి కూడా వికెట్లు తీయడంలో బంగ్లా బౌలర్లు సఫలం కావడంతో విజయం సులభమైంది. ఓ దశలో నెదర్లాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. కానీ, బ్యాట్స్‌మెన్స్ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. స్టెఫాన్ మైబర్గ్ 29, కెప్టెన్ పీటర్ బోరెన్ 29, బెన్ కూపర్ 20, టామ్ కూపర్ 15 పరుగులు చేసినా చివర్లో బౌలర్లు చేతులేత్తేశారు. బంగ్లా బౌలర్లు అమిన్ హుస్సేన్ రెండు, షకిబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, నాసిర్ హుస్సన్, మొర్తజా తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసినా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగినా... మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. వరుస వికెట్లు కోల్పోతున్న ఇక్బాల్ ధీటుగా ఆడుతూ టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా తమీమ్ ఇక్బాల్ ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7 గంటలకు ఐర్లాండ్, ఒమన్ ల మధ్య జరుగును. -
వరల్డ్ టీ 20: నెదర్లాండ్ విజయలక్ష్యం 154
ధర్మశాల: వరల్డ్ టీ-20లో భాగంగా బుధవారం హిమచలప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో నెదర్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దాంతో నెదర్లాండ్ జట్టుకు 154 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన నెదర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వరుస వికెట్లు కోల్పోతున్న ధీటుగా ఆడుతూ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. షబ్బీర్ రెహ్మన్ 15 పరుగులు, మహ్మదుల్లా 10 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా, నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. -
అఫ్ఘానిస్తాన్ శుభారంభం
* స్కాట్లాండ్తో మ్యాచ్ * టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నాగ్‌పూర్: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ జట్టు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా గ్రూప్ ‘బి’లో మంగళవారం జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘాన్ 14 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ మొహమ్మద్ షెహజాద్ (39 బంతుల్లో 61; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), అస్గర్ (50 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగి రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. మున్సే (29 బంతుల్లో 41; 9 ఫోర్లు), కొయెట్జెర్ (27 బంతుల్లో 40; 4 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడి తొలి వికెట్‌కు 84 పరుగుల శుభారంభాన్నిచ్చినా ఆ తర్వాత జట్టు త్వరగా వికెట్లు కోల్పోయింది. అయితే మధ్య ఓవర్లలో మ్యాట్ మ్యాకన్ (31 బంతుల్లో 36; 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి శిబిరంలో ఆందోళన రేపాడు. అయితే నబీ అతడిని అవుట్ చేయడంతో స్కాట్లాండ్ కోలుకోలేకపోయింది. -
ఊపిరి పీల్చుకున్న జింబాబ్వే
* హాంకాంగ్‌పై విజయం * టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నాగ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్లో తమ అనుభవాన్ని ఉపయోగించి ఆడిన జింబాబ్వే జట్టు గట్టి సవాల్ విసిరిన హాంకాంగ్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గింది. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన ఈమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. 62 పరుగులకే నాలుగు వికెట్లు పడినా ఓపెనర్ సిబండా (46 బంతుల్లో 59; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. అయితే చివర్లో చిగుంబురా (13 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు 150 పరుగులు దాటింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు చేసింది. ఓపెనర్ అట్కిన్సన్ (44 బంతుల్లో 53; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ అఫ్జల్ (17 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడి ఆందోళన పెంచినా బౌలర్లు చివర్లో కట్టడి చేశారు. -
వరల్డ్ టీ 20: స్కాట్లాండ్ విజయలక్ష్యం 171
నాగ్ పూర్: వరల్డ్ టీ 20 లో భాగంగా మంగళవారమిక్కడ నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో అఫ్ఘానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దాంతో స్కాట్లాండ్ జట్టుకు 171 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్ఘానిస్తాన్ జట్టు ఆదిలోనే తడబడింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మహమ్మద్ షాహజాద్ 61 పరుగులు చేయగా, నూర్ అలీ జిద్రాన్ 17 పరుగులు చేసి పెవీలియన్ చేరారు. గుల్బదీన్ కూడా 12 పరుగులకే పరిమితం కాగా, మహమ్మద్ నాబి (1), షఫీఖుల్లా (14) రన్ ఔటయ్యారు. అస్గార్ 55, జాద్రాన్ 3 పరుగులతో నాట్ ఔట్‌గా నిలిచారు. కాగా, స్కాట్లాండ్ బౌలర్లు ఎమ్ఆర్జె వాట్, డేవీ, ఈవాన్స్ తలో వికెట్ తీసుకున్నారు. -
17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన అఫ్ఘానిస్తాన్
నాగ్ పూర్: వరల్డ్ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారమిక్కడ నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో అఫ్ఘానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన మహమ్మద్ షాహజాద్ 61 పరుగులు చేయగా, నూర్ అలీ జిద్రాన్ 17 పరుగులు చేసి పెవీలియన్ చేరారు. గుల్బదీన్ కూడా 12 పరుగులకే పరిమితం కాగా, మహమ్మద్ నాబి రన్ ఔటయ్యాడు. దాంతో 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి అఫ్ఘానిస్తాన్ 145 పరుగులతో కొనసాగుతోంది. కాగా, స్కాట్లాండ్ బౌలర్లు ఎమ్ఆర్జె వాట్, డేవీ, ఈవాన్స్ తలో వికెట్ తీసుకున్నారు. -
'ఆ క్రికెట్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ'
ముంబై: వరల్డ్ టీ20 లో టీమిండియానే ఫేవరెట్ జట్టని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు వరల్డ్ కప్‌ను గెలవాలని ఇక్కడకు వచ్చినా.. ఆ కప్‌ను అందుకునే ఎక్కువ అర్హత ధోని సేనకే ఉందన్నాడు. వాంఖేడ్ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న అనంతరం విలియమ్సన్ మీడియాతో ముచ్చటించాడు. 'మేము మార్చి 15 వ తేదీన జరిగే మొదటి మ్యాచ్‌లో వరల్డ్ కప్ ఫేవరెట్స్ గా ఉన్న భారత్‌తో తలపడుతున్నాం.ఆ జట్టు అత్యంత నిలకడగా ఉంది. భారత్ జట్టులో విన్నర్లు ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం కష్టమే. ఈ టోర్నీకి ఎలా సన్నద్ధమవుతున్నామో, అదే క్రమంలో ఇక్కడ ఉండే పరిస్థితికి కూడా పూర్తిగా అలవాటు పడాలి. గత కొంతకాలంగా యువకులతో కూడిన మా జట్టు అనేక విజయాల్ని సొంతం చేసుకుంది. ఇదే ఊపును వరల్డ్ టీ 20లో కూడా కొనసాగించాలని అనుకుంటున్నాం'అని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన బ్రెండెన్ మెకల్లమ్‌పై విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. తమకు అతనొక ఆదర్శ కెప్టెన్ అని అభివర్ణించాడు. న్యూజిలాండ్ విజయాల్లో మెకల్లమ్ పాత్ర మరువలేనిదని విలియమ్సన్ పేర్కొన్నాడు. -
హాంకాంగ్ విజయలక్ష్యం 159
నాగ్ పూర్:వరల్డ్ టీ 20లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో జింబాబ్వే 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన హాంకాంగ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే బ్యాటింగ్ చేపట్టింది. జింబాబ్వే కెప్టెన్ హమిల్టన్ మసకద్జ(20;13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడే యత్నంలో తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం ముతుంబామి డకౌట్ గా అవుట్ కావడంతో జింబాబ్వే 38 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో విసు సిబందా(59;46 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఆపై మాల్కోమ్ వాలర్(26) ఫర్వాలేదనిపించగా, చివర్లో చిగుంబరా(30) బ్యాట్ ఝుళిపించడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు నమోదు చేసింది. హాంకాంగ్ బౌలర్లలో తన్వీర్ అఫ్జల్, ఐజాజ్ ఖాన్లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
ధర్మశాలకు చేరుకున్న బంగ్లాదేశ్
ధర్మశాల:వరల్డ్ టీ20లో బంగ్లాదేశ్ జట్టు సోమవారం రాత్రి ధర్మశాలకు చేరుకుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం ఇక్కడ హెచ్.పి.సి.ఎ స్టేడియంలో నెదర్లాండ్స్ జట్టుతో బంగ్లాదేశ్ తలపడనుంది. గ్రూప్ -ఏలో బంగ్లాదేశ్ తో పాటు, నెదర్లాండ్, ఐర్లాండ్, ఒమన్‌లు ఉన్నాయి. ఆయా జట్ల పరిస్థితుల్ని చూస్తే ఇక్కడ బంగ్లాదేశ్ బలంగా కనబడుతోంది. ఒకవేళ బంగ్లాదేశ్ సూపర్ 10 దశకు అర్హత సాధిస్తే మాత్రం భారత్ జట్టు ఉన్న గ్రూప్-2లో చేరుతుంది. -
'ఆ క్రికెటర్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'
కోల్ కతా: ప్రపంచ టీ 20 టోర్నీలో పాల్గొనే తమ జట్టులో కీరోన్ పొలార్డ్, సునీల్ నరైన్‌లు లేకపోవడం నిజంగా పూడ్చలేని లోటేనని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామీ అభిప్రాయపడ్డాడు. పొలార్డ్ స్థానంలో కార్లోస్ బ్రాత్ వైట్‌ను జట్టులో స్థానం కల్పించగా, నరైన్ స్థానాన్ని ఆష్లే నర్సీతో భర్తీ చేయనున్నామన్నాడు. కాగా, పొలార్డ్, నరైన్ లు లేనిలోటు తమ జట్టులో కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నాడు. వరల్డ్ టీ 20కి వెస్టిండీస్ జట్టును ప్రకటించాక పొలార్డ్, నరైన్‌లు ఆకస్మికంగా వైదొలగిన సంగతిని సామీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. పొలార్డ్ ఫిట్ నెస్ కారణంగా జట్టుకు దూరమవ్వగా, నరైన్ తన బౌలింగ్ శైలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా జట్టుకు దూరం కావాల్సి వచ్చిందన్నాడు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన సామీ.. తమ జట్టుకు టీ 20ల్లో ఆడిన అనుభవం ఎక్కువన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ల్లో భాగంగా తమ జట్టులోని ఎక్కువ శాతం మంది ఆటగాళ్లు దుబాయ్‌లో ఉండటం చేత గత వారమే తమ జట్టు ఇక్కడకు చేరుకుందన్నాడు. దుబాయ్‌లోని వాతావరణ పరిస్థితులకు భారత్‌లోని పరిస్థితులకు చాలా దగ్గర లక్షణాలు ఉంటాయని, ఇది తమకు కచ్చితంగా కలిసొస్తుందని ఆశిస్తున్నట్లు సామీ తెలిపాడు. -
ఫీల్డింగ్ ఎంచుకున్న హాంకాంగ్
నాగ్ పూర్:వరల్డ్ టీ 20లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో హాంకాంగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జింబ్వాబే జట్టుకు మసకద్జ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా, హాంకాంగ్ జట్టుకు తన్వీర్ అఫ్జల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించిన హాంకాంగ్ వరుసగా రెండోసారి టోర్నీలో పాల్గొంటోంది. గత నాలుగు నెలల కాలంలో ఆ జట్టు 10 టి20 మ్యాచ్‌లు ఆడితే 7 ఓడింది. మరోవైపు జింబాబ్వే జట్టులో నిలకడలేమి పెద్ద సమస్య.2009లో మినహా మిగిలిన నాలుగు ప్రపంచకప్‌లలో జింబాబ్వే పాల్గొంది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడితే 3 గెలిచి, 6 ఓడింది. ఓవరాల్‌గా టి20ల్లో ఆ జట్టు 48 మ్యాచ్‌లలో 10 గెలిచి, 37 ఓడింది. జింబాబ్వే కూడా తొలిసారి క్వాలిఫయింగ్ పోటీని ఎదుర్కొంటోంది. జింబాబ్వే టాప్-8లో లేకపోవడంతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.