'ఆ క్రికెటర్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'
కోల్ కతా: ప్రపంచ టీ 20 టోర్నీలో పాల్గొనే తమ జట్టులో కీరోన్ పొలార్డ్, సునీల్ నరైన్లు లేకపోవడం నిజంగా పూడ్చలేని లోటేనని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సామీ అభిప్రాయపడ్డాడు. పొలార్డ్ స్థానంలో కార్లోస్ బ్రాత్ వైట్ను జట్టులో స్థానం కల్పించగా, నరైన్ స్థానాన్ని ఆష్లే నర్సీతో భర్తీ చేయనున్నామన్నాడు. కాగా, పొలార్డ్, నరైన్ లు లేనిలోటు తమ జట్టులో కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నాడు. వరల్డ్ టీ 20కి వెస్టిండీస్ జట్టును ప్రకటించాక పొలార్డ్, నరైన్లు ఆకస్మికంగా వైదొలగిన సంగతిని సామీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
పొలార్డ్ ఫిట్ నెస్ కారణంగా జట్టుకు దూరమవ్వగా, నరైన్ తన బౌలింగ్ శైలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా జట్టుకు దూరం కావాల్సి వచ్చిందన్నాడు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన సామీ.. తమ జట్టుకు టీ 20ల్లో ఆడిన అనుభవం ఎక్కువన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ల్లో భాగంగా తమ జట్టులోని ఎక్కువ శాతం మంది ఆటగాళ్లు దుబాయ్లో ఉండటం చేత గత వారమే తమ జట్టు ఇక్కడకు చేరుకుందన్నాడు. దుబాయ్లోని వాతావరణ పరిస్థితులకు భారత్లోని పరిస్థితులకు చాలా దగ్గర లక్షణాలు ఉంటాయని, ఇది తమకు కచ్చితంగా కలిసొస్తుందని ఆశిస్తున్నట్లు సామీ తెలిపాడు.